ప్రకాశం జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు మందకొడిగా జరుగుతున్నాయి. ఓటర్లు అంత ఆసక్తి కనబరచకపోవటంతో.. పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేసి వెళ్తున్నారు. చాలా గ్రామాల్లో ఓటర్ లిస్ట్ కూడా పంపిణీ చేయలేదు. తెదేపా ఎన్నికలు బహిష్కరించడంతో ఆ పార్టీ నాయకులు.. ఎవరు పోలింగ్ కేంద్రాల వద్ద లేరు.
ప్రశాంతంగా పోలింగ్..
కనిగిరి నియోజకవర్గంలో 27 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
మందకొడిగా..
మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. వేములకోటలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో తొమ్మిది గంటలకు వందమంది కూడా ఓటు వేయలేదు. తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లో కూడా ఇదే ఓటింగ్ సరళి కొనసాగుతోంది.
ఆసక్తి చూపని ఓటర్లు..
చీరాల నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్ స్లిప్పులు కూడా అందించకపోవడంతో ఓట్లు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో పంచాయతీల విభజన, విలీనం విషయమై కోర్టు వివాదాలు ఉండటంతో ఎంపీటీసీ ఎన్నికలు నిలిచిపోగా.. చీరాల, వేటపాలెం మండలాల్లో జడ్పీటీసి ఎన్నికలు మాత్రం యధావిధిగా జరుగుతున్నాయి.
గుండెపోటుతో మృతి..
పొన్నలూరు మండలం తిమ్మపాలెం ఎంపీటీసీ షేక్ సాహెబ్ ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. త్వరలో ప్రమాణ స్వీకారం ఉండగా.. మరణించడంతో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సింగరాయకొండ ఎంపీటీసీ స్థానంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేసాను అంటూ ఓ కార్యకర్త ఓటర్ స్లిప్‌ను ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు..
ఇదీ చదవండి: 'అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి'