ప్రకాశం జిల్లాలో లాక్ డౌన్ ప్రభావం నుంచి చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇంకా కోలుకోలేదు. జిల్లాలో ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమలతో వందలాది కార్మికులు, చిన్నచిన్న పారిశ్రామికవేత్తలు జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఏడాదిగా ఈ పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు కరోనాతో మరింత కుదేలైంది.
లాక్ డౌన్ అనంతరం పరిశ్రమలు నడిపేందుకు అనుమతి లభించినా గ్రానైట్ పరిశ్రమలకు పెద్దగా ఉపయోగం లేకపోయింది. నిపుణులైన పనివారు సొంతూళ్లకు వెళ్లిపోవడం, మార్కెట్ లేకపోవడం వంటి కారణాలతో పరిశ్రమలు సరిగ్గా నడవడంలేదు. చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు, మద్దిపాడు గ్రోత్ సెంటర్ తదితర ప్రాంతాల్లో సుమారు 1,578 చిన్న మధ్యతరహా గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. గాంగ్‌సా వంటి 33 భారీ పరిశ్రమలు మద్దిపాడు సెజ్‌లో ఉన్నాయి. దాదాపు 24లక్షల క్యూబిక్‌మీటర్ల పలకలు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఇక్కడి నుంచి చైనా వంటి దేశాలకు సరకును సరఫరా చేస్తారు. అయితే కరోనా కారణంగా చైనా నుంచి ఆర్డర్లు రావడంలేదని పరిశ్రమ యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
లాక్ డౌన్ సడలింపులతో కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం ప్రధానంగా పరిశ్రమను దెబ్బతీసిందని చెప్తున్నారు. కొద్ది రోజులయ్యాక వస్తారులే అనుకున్న యజమానులకు వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో పనిచేసేవారు లేక పరిశ్రమలు తెరుచుకోవడంలేదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ బిహార్, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన వలస కార్మికులతోనే నడుస్తాయి. స్థానికంగా పనిచేసేవారు ఒక పరిశ్రమలో ఇద్దరో ముగ్గురో ఉంటారు. నైపుణ్య పనులన్నీ ఇతర రాష్ట్రాల కార్మికులే చేస్తారు. కరోనా భయంతో వారంతా సొంతూళ్లలోనే ఉండిపోవటంతో పరిశ్రమలు నడవడంలేదు. ఉన్నవారితోనే ఉత్పత్తి చేద్దామనుకున్నా.. మార్కెట్ లేక నష్టాలే మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
పరిశ్రమలు నడవక తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని యజమానులు వాపోతున్నారు. దానికి తోడు నిర్వహణ ఖర్చు, కరెంట్ బిల్లులు, ఈఎమ్ఐలు కట్టలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చదవండి...
కనకదుర్గ పైవంతెన.. ఆగస్టు కల్లా పూర్తయ్యేనా.. నగర వాసుల ఆశ నెరవేరేనా!