లేత పాలబుగ్గలతో, లేలేత పాదాలతో బుడిబుడి అడుగులు వేస్తున్న వయసు... ఇంటి ప్రాంగణంలో అప్పటివరకు ఆడుతూ సందడి చేసిన బాలుడు అంతలోనే మాయమయ్యాడు. ఈ ఘటన 2019 జూన్ 24న ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని రెడ్డినగర్ గ్రామంలో జరిగింది.
ముండ్లమూరు మండలం పెద ఉల్లగల్లు పంచాయతీ పరిధిలోని రెడ్డి నగర్ గ్రామానికి చెందిన మేడం అశోక్ రెడ్డి, జ్యోతి దంపతుల తనయుడు ఆరుష్‌రెడ్డి కనిపించకుండా పోయాడు.. అపహరణకు గురయ్యేనాటికి బాలుడి వయసు కేవలం 25 నెలలు మాత్రమే. బాలుడు కనిపించకుండాపోయి 14 నెలలు గడుస్తున్నా.. నేటికీ ఆచూకీ లేదు.
- ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ...
2019 జూన్ నెల 24వ తేదీన సాయంత్రం ఆరుష్ రెడ్డి తోటి చిన్నారులతో కలసి ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా అంతలోనే కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేదు. దీంతో ఆరుష్‌రెడ్డి తండ్రి అశోక్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అప్పట్లో డాగ్ స్క్వాడ్ ,క్లూస్ టీంని రప్పించారు. గ్రామంలో సంచరించిన డాగ్ స్క్వాడ్ ..అద్దంకి - దర్శి ప్రధాన రహదారి పైకి వెళ్లి తిరిగి ఇంటికి చేరింది. దీంతో బాలుడుని ఎవరో అపహరించారనే అనుమానాలు బలపడ్డాయి.అప్పుడు విధుల్లో ఉన్న దర్శి డీఎస్పీ నాగరాజు, పొదిలి సీఐ శ్రీరామ్ దర్శి సీఐ కరుణాకర్, 5 మండలాల ఎస్సైలు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది రోజులకే వారందరూ బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన పోలీసు సిబ్బంది సైతం చిన్నారి ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. ఒక సిఐని, ఎస్సైలను ప్రత్యేకంగా ఈ కేసు దర్యాప్తుకోసం ఉన్నతాధికారులు నియమించారు. వారు కూడా ఎటువంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
- తిరగని గడప... ఎక్కని మెట్టు లేదు...
తమ కుమారుడి జాడ కనిపెట్టి అప్పగించాలని కోరుతూ ఆరుష్ రెడ్డి తల్లితండ్రులు నాటి నుండి నేటి వరకూ తిరగని గడప లేదు... ఎక్కని కార్యాలయాల మెట్లు లేవు. ప్రజాప్రతినిధులు, అధికారులు,రాజకీయ నాయకులను కలసి తమ గోడును వెల్లబోసుకున్నారు. అప్పట్లో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ బాలుడి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను కలసి వివరాలు తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించారు. చివరికి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా అశోక్ రెడ్డి కలిసి తమ చిన్నారి ఆచూకీ కనుగొనాలని విన్నవించుకున్నా... నేటికీ కేసు పరిస్థితిలో పురోగతి లేదు. తమ ఆశాదీపం ఎక్కడుందో...ఎలా ఉన్నాడోనని ఆ తల్లితండ్రులు తల్లడిల్లుతున్నారు.
ఇదీ చదవండి: ఆయన తిరిగి విధులకు రాలేదు...