Nellore District News: నెలనెలా వచ్చే పింఛన్ డబ్బుతోనే.. బతుకులు వెళ్లదీస్తున్న వృద్ధులు వాళ్లు. అలాంటి పండుటాకుల నుంచీ.. చెత్త పన్ను పిండారు అధికారులు! ఏకంగా పింఛను డబ్బు నుంచి చెత్త పన్ను, ఇంటి పన్ను మినహాయించుకున్నారు!! ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అనంతసాగరంలో ఇంటి పన్నులు చెల్లించాలంటూ.. ఈ నెల ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ సోమ్ములో.. ఒక్కో లబ్ధిదారు నుంచి వెయ్యి రూపాయలు మొదలు.. 2 వేల రూపాయల వరకూ వసూలు చేశారు వాలంటీర్లు.
తాము ఆ సోమ్ముపైనే ఆధారపడి బతుకుతున్నామని.. మొత్తం సొమ్ము ఇవ్వాలంటూ వృద్ధులు కాళ్లా, వేళ్లాపడ్డా కనికరించలేదు. పన్నులకు ఎంత కావాలో అంత తీసుకొని.. మిగిలింది తమ చేతిలోపెట్టి పోయారని బాధిత వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ లో కోత పడడంతో.. ఈనెల గడిచేది ఎలాగో అర్థం కావట్లేదని లబోదిబోమంటున్నారు వృద్ధులు.
తమ పరిస్థితి బాగాలేదని.. వీలు చూసుకుని ఇంటి పన్ను చెల్లిస్తామన్నా.. అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "పింఛన్ డబ్బుతోనే.. మందులు, నిత్యావసర సరకులు తీసుకుంటున్నాం. ఇలా ఉన్నఫలంగా డబ్బులు తీసుకుంటే మేము ఎలా బతకాలి' అని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. జలదంకిలో చెత్తపన్ను కట్టలేదని పింఛన్ సొమ్ములో మినహాయించుకున్నారని వృద్ధులు తెలిపారు. అధికారులు.. తమకు పూర్తి పింఛన్ డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
ఉగాది పంచాంగంలో.. ఆర్థిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోంది: యనమల