Minister Gautam Reddy Passes away: మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతికి సంతాపసూచకంగా... రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చారు.
అధికారిక కార్యక్రమాలు వాయిదా..
గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపసూచకంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. రేపటి 'జగనన్న తోడు' ఆర్థికసాయం అందజేత కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నిధులను ఈ నెల 28న జమ చేస్తామని వెల్లడించారు. మరోవైపు మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.
సచివాలయం వద్ద విషాదఛాయలు..
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో సచివాలయం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మంత్రి ఛాంబర్ వద్ద ఆయన ఫొటోను ఉంచి సిబ్బంది నివాళులు అర్పించారు. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా సచివాలయంలో మంత్రి మేకపాటి.. తన కార్యాలయాన్ని అందుకు అనుగుణంగానే తీర్చిదిద్దుకున్నారు. విదేశీ ప్రతినిధులు, పరిశ్రమలకు సంబంధించిన కార్పొరేట్ల రాకపోకలు ఉంటాయనే ఆలోచనతో ఛాంబర్ ను తయారు చేయించారు. ప్రస్తుతం ఆయన మృతితో సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కార్యాలయం వద్ద సిబ్బంది విషణ్ణవదనంతో కనిపించారు. సౌమ్యుడిగా పేరున్న మంత్రి మేకపాటి సిబ్బందిని కూడా గౌరవంగా చూసేవారని, ఆప్యాయంగా పలకరించేవారని పేర్కొన్నారు.
బుధవారం అంత్యక్రియలు..
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటులో ఈ ఉదయం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు అర్జున్‌రెడ్డి అక్కడి నుంచి బయల్దేరారు. రేపు ఉదయం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. బుధవారం నెల్లూరు జిల్లా బ్రహ్మణపల్లిలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు అపోలో ఆస్పత్రి నుంచి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తీసుకెళ్లారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఈ సాయంత్రం వరకు అక్కడే ఉంచనున్నారు. రేపు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి గౌతమ్‌రెడ్డి పార్ధీవదేహాన్ని తరలించనున్నారు.
గౌతమ్ రెడ్డి హఠాన్మరణం..
మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు.. గౌతమ్‌రెడ్డికి గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. గౌతమ్‌రెడ్డి వయస్సు 49 ఏళ్లు.. ఆయన 1971లో జన్మించారు. ఆయన నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. వారం రోజుల పాటు దుబాయ్ ఎక్స్‌పోకు హాజరయ్యారు.
గౌతంరెడ్డి.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా ఉన్నారు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1971 నవంబరు 2 జన్మించిన గౌతంరెడ్డి.. బ్రిటన్‌లో ఎమ్మెస్సీ చదివారు. 2014, 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలుపొందారు. 2019 జూన్ 8న మంత్రిగా గౌతంరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గౌతంరెడ్డిది రాజకీయ కుటుంబ నేపథ్యం.. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాజీ ఎంపీ.
ఇదీ చదవండి:
Gowtham Reddy No More: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(49) కన్నుమూత