జిల్లాలో చైల్డ్ కేర్ కింద స్వచ్ఛందంగా నడిచే 45 హోమ్‌లు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో 21 నడుస్తున్నాయి. వీటిలో గతంలో 930 మంది ఉంటే 735 మందిని ఇళ్లకు పంపించారు. ప్రస్తుతం 195 మంది పిల్లలే వసతి పొందుతున్నారు. వీరిలో 108 మంది బాలికలు, 87 మంది బాలురు ఉన్నారు.
ప్రతి నెలా పరిశీలన
హోమ్‌ల నుంచి ఇళ్లకు వెళ్లిన పిల్లలు ఏ విధంగా ఉన్నారనే విషయాన్ని ప్రతి నెలా బాలల సంరక్షణ బృందం వారి ఇళ్లకు వెల్లి పరిశీలన చేయాల్సి ఉంది. అమ్మాయిలకు బాల్య వివాహాలు చేశారా?, పిల్లలను బయట పనులకు పంపుతున్నారా, వారికి అందుతున్న సేవలు, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయనే విషయాన్ని పరిశీలన చేయాల్సి ఉంది. నామమాత్రంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు
హోమ్‌లలో ఉన్న అనాథ పిల్లల కోసం కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు కషాయం, రాగి జావా, డ్రైఫ్రూట్స్, పండ్లు, పాలు, గుడ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. మూడు నెలలకు ఒక సారి నిత్యావసర సరకులు సమకూరుస్తున్నాం. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని జిల్లా జువెనైల్ వెల్పేర్ ప్రొహిబేషన్ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు.
కానరాని జాగ్రత్తలు
జిల్లాలో ఐసీడీఎస్ పరిధిలో బాలికలకు అయిదు బాల సదనాలు ఉన్నాయి. నెల్లూరు, వెంకటగిరి, కోట, గూడూరు, సూళ్లూరుపేటలో ఇవి ఉన్నాయి. వీటిలో 182 మంది బాలికలు వసతి పొందే వారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తల్లిదండ్రులు, బంధువులు ఉన్న 163 మంది పిల్లలను ఇళ్లకు పంపించారు. మిగిలిన 19 మంది నెల్లూరు బాలసదనంలోనే ఉంచి, మిగిలిన నాలుగు సదనాలు మూసేశారు. అయితే ఉన్న ఈ ఒక్క బాల సదనంలో కొవిడ్ నిబంధనల మేరకు చర్యలు చేపట్టలేదు. శానిటైజర్లు, ఇతర ఏర్పాట్లు ఇక్కడ కల్పించలేదు. సిబ్బందే ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి మూడేళ్లుగా సమ దుస్తులు, నిత్యం వినియోగించే సాధారణ దుస్తులు రాలేదు. దాతాల సహకారంతో బాలికలకు అందజేస్తున్నారు. అలాగే దుప్పట్లు, దిండ్లు కొత్తవి అందించలేదు. పాత వాటినే వినియోగిస్తున్నారు.
ఇవీ చూడండి…