Group 1 Prelims Exam Analysis: ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ స్క్రీనింగ్ పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై పలు ప్రశ్నలు ఆడిగారు. ఆదివారం ఉదయం నిర్వహించిన మొదటి పేపర్‌లోని ఆంధ్రప్రదేశ్ ఎకానమీ విభాగంలో వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్, కౌలు రైతులు, నవరత్నాలు, దిశ యాప్, పోలవరానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో పేపర్లోని కరెంట్ ఎఫైర్స్ విభాగంలో మత్స్యకార భరోసా, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, మైనారిటీలకు ప్రత్యేక బడ్జెట్, ఉర్దూ అధికార భాషగా ప్రకటన, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఓడరేవుల నిర్మాణం, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులు, ఇటీవల నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌పై ప్రశ్నలు అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో నవరత్నాల్లో భాగం కానిది ఏది? ఆపదలో ఉన్న మహిళల కోసం ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఎస్ఓఎస్ సేవ ఏది? తదితర ప్రశ్నలు వచ్చాయి.
మొదటి పేపర్లో చరిత్రపై అడిగిన ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు తెలిపారు. జాగ్రఫీ ప్రశ్నలు కొన్ని కఠినంగా వచ్చాయని చెప్పారు. పాలిటీ, ఎకానమీ ప్రశ్నలు కొంత సులభతరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రెండో పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అంతరిక్షంపై అడిగిన ప్రశ్నలతోపాటు.. అర్థమెటిక్ అండ్ రీజినింగ్పై వచ్చిన ప్రశ్నలు కష్టతరంగా ఉన్నాయని, ఎక్కువ ప్రశ్నలు గణితంపైనే ఉన్నట్లు తెలిపారు. రెండు పేపర్లలోనూ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయని, సమాధానాలను గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టేలా ఇచ్చారని వెల్లడించారు. ఆంగ్ల ప్రశ్నలను తెలుగులో యథాతథంగా అనువదించడంతో అర్థం చేసుకోవడం కొంత ఇబ్బందిగా మారిందని తెలుగు మాధ్యమ విద్యార్థులు చెప్పారు. మొత్తంగా ప్రిలిమ్స్ పరీక్ష కఠినంగా ఉన్నట్లు ఎక్కువ మంది తెలిపారు. యూపీఎస్సీ స్థాయిలో ప్రశ్నపత్రం ఉందని చెప్పారు.
ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షకు 1:15 నిష్పత్తిలో ఎంపిక చేస్తే 110 మార్కుల వరకూ కటాఫ్, 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తే 90మార్కులకు పైగా కటాఫ్ ఉండొచ్చని పలువురు అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నిన్న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 82.38శాతం మంది హాజరయ్యారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 85శాతం..అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 73.89 శాతం మంది పరీక్ష రాశారు. రెండు, మూడు వారాల్లోగా ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడించిన రోజు నుంచి 80 రోజుల్లో ప్రధాన పరీక్షలను నిర్వహిస్తారు.
ఇవీ చదవండి: