వాహనాలపై మీడియా స్టిక్కర్లు అంటించి కర్నూలు జిల్లా నంద్యాలలో గుట్టుగా గుట్కా తరలిస్తున్న వ్యాపారస్థులను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 1వ తేదీన వెంకటేశ్వరపురం వద్ద వాహనాల తనిఖీల్లో ఓ దినపత్రికను తరలించే వాహనంలో రూ.5700 విలువైన 570 గుట్కా ప్యాకెట్లు గుర్తించారు. వాటికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులకు భారీగా గుట్కా దొరికింది.
కర్నూలుకు చెందిన కోట్ర సుబ్బయ్య అనే వ్యక్తి తన వాహనానికి ప్రెస్ స్టిక్కర్‌ను అతికించి విలేకరిగా చలామణి అవుతూ గుట్కా రవాణా చేస్తున్నాడు. కర్ణాటక రాయచూరు ప్రాంతంలో గుట్కా కొనుగోలు చేసి కర్నూలుకు చెందిన వారికి అమ్ముతున్నాడని నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు.
నంద్యాలలో మరో చోట గుట్కాను తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.11 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, రూ.8.88 లక్షల నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, క్యాష్ మెషిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 9 మంది పట్టుబడగా... ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి : రూ.15 లక్షల విలువైన గుట్కా పట్టివేత