రాష్ట్రాన్ని రూ.10లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన సీఎంగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. తెచ్చిన అప్పులూ అభివృద్దిపై ఖర్చు పెట్టకుండా జగన్ అనుచరులకే పంచిపెడుతున్నారని ఆరోపించారు. పేదల ఖాతాల్లో పడే నగదు అరకొరేనన్నారు. అర్హులలో మూడొంతుల మందికీ లబ్ధి చేకూరడం లేదన్నారు. పతనావస్థలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ఉందన్న యనమల.. భావితరాలూ ఈ అప్పులను తీర్చలేని దుస్థితి ఉందని విమర్శించారు.
ఏడాదిలో చేయాల్సిన అప్పులు తొలి 5 నెలల్లోనే చేశారని, మిగిలిన 7నెలల్లో అప్పులెన్ని చేస్తారో తల్చుకుంటే బయంగా ఉందని యనమల అన్నారు. రోజువారీ ఖర్చులకూ అప్పులు చేయాల్సిన దురవస్థ తెచ్చారని ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఎంత పతనమయ్యిందో కాగ్ లెక్కలే సాక్ష్యమన్నారు. 62ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 3,45,000కోట్ల రూపాయలైతే, వైకాపా పాలనలో ఏడాదికి 1,13,112కోట్ల రూపాయలు అప్పు చేశారని యనమల అన్నారు. రాష్ట్ర ఆర్ధికాభివృద్దిని గాలికి వదిలేసి.. సీఎం జగన్ అనుచరుల ఆర్థికాభివృద్దికే పెద్దపీట వేశారన్నారు.
ఇదీ చదవండి: ఏడాది అప్పు ఐదు నెలల్లోనే!