తన ఖాతాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సొమ్ము తనది కాకపోయినా జమకావడంతో కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసి విచారణ కోరితే తనపైనే అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని నెల్లూరు జిల్లాకు చెందిన రైతు జైపాల్ ఆవేదన వ్య్వక్తం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు రావాల్సిన సొమ్ముకంటే అధికంగా ఎందుకు వచ్చిందని ప్రశ్నించడంలో తాను చేసిన తప్పేంటని.. ప్రశ్నించారు.
పోలీసులు దుర్భాషలాడుతూ తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని.. తన ఖాతాలో జమ ఐన సొమ్ముపై విచారణ జరిపించాలని కోరారు. వైకాపా ప్రభుత్వంలో దళారుల విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆరోపించారు. వెనుకబడిన వర్గాల రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి.. వారి ఆధార్ నెంబర్లపైనే ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని తెదేపా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆరోపించారు. జైపాల్‌కు జరిగిన అన్యాయంపై విచారణ చేయించాలని.. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. న్యాయం జరిగేవరకు జైపాల్‌కు తెదేపా అండగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్