స్పందన కార్యక్రమానికి సాధారణ అర్జీలతోపాటు కొన్ని ప్రత్యేక దరఖాస్తులు వస్తున్నాయి. అలాంటి కొందరు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో గోడు చెప్పుకున్నారు.
కారు ప్రమాదంలో కిరణ్ వెన్నెముక విరిగింది. అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. సొంత పనులు చేసుకునే వీల్లేదు. మంచినీళ్లు తాగాలన్నా మరొకరి సాయం అవసరం. రోజూ ఫిజియోథెరపీ చేస్తే కానీ... కాళ్లు చేతుల్లో స్పర్శ, కదలిక ఉండదు. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు తమనూ ప్రత్యేక క్యాటగిరీ కింద గుర్తించి 10 వేల రూపాయలు పింఛను అందించాలని కోరుతున్నారు.
కిరణ్ మాత్రమే కాదు స్పందన కార్యక్రమానికి వచ్చిన అందరిదీ అదే పరిస్థితి. కొందరు ప్రమాదవశాత్తూ దివ్యాంగులుగా మారితే, ఇంకొందరు వైద్యం వికటించి చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛను ఏ మాత్రం సరిపోవడం లేదని...తమనూ ప్రత్యేకంగా గుర్తించి 10 వేలు ఇవ్వాలని వేడుకుంటున్నారు.
బాధితుల అభ్యర్థనపై స్పందించిన దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్... సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.పింఛను 10వేలకు పెంచి... స్వయం ఉపాధి పొందేలా రాయితీతో కూడిన రుణాలు అందిస్తే జీవితంలో స్థిరపడతామని చెబుతున్నారీ బాధితులు.
ఇదీ చూడండి