గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరగడంతో రోగుల కోసం ఆస్పత్రుల్లో మరిన్ని పడకలు సిద్ధం చేయాలని ఇంఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను కొవిడ్ బాధితులకు అందుబాటులోకి తేవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న 20వేల మంది సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో రాష్ట్రస్థాయి కొవిడ్ కంట్రోల్ సెంటర్ ఛైర్మన్ జవహర్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న 18వేల పడకలను 37వేలకు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంక్షల విధింపు...
కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను బట్టి ఎక్కడికక్కడ మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు. గుంటూరులో ఈనెల 25 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. దుకాణాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే తెరవనున్నారు. రాత్రి 7 గంటల తర్వాత ప్రజలెవరూ బయట తిరగొద్దని పోలీసులు హెచ్చరించారు. అధిక కేసులు నమోదయ్యే ప్రాంతాల్ని మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తారు. సత్తెనపల్లిలో నేటి నుంచే ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. శ్రీకాకుళంలో కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా శుభకార్యాలకు వీలైనంత తక్కువ మంది హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఆమదాలవలసలో మాస్కులు ధరించని వారికి పోలీసులు చలానా విధించారు. ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో అడ్మిషన్ కోసం రోగులు గంటల తరబడి ఎండలో ఎదురుచూడాల్సి వస్తోంది.
ఏకాంతంగా వసంతోత్సవాలు...
కరోనా కేసుల దృష్ట్యా ఈనెల 24 నుంచి 26 వరకు జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను తితిదే ఏకాంతంగా నిర్వహించనుంది. శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలను సైతం తితిదే తాత్కలికంగా నిలిపివేసింది. తిరుపతి స్విమ్స్‌లో కొవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటుకు తితిదే ఈవో సూచించారు. తిరుచానూరులోని పద్మావతి నిలయం, తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం వసతి సమూదాయాల్ని గతేడాది మాదిరే కొవిడ్ బాధితుల కోసం వినియోగించుకోలని చిత్తూరు కలెక్టర్‌ను తితిదే ఈవో కోరారు.
ఇదీచదవండి.: వాలంటీరే.. అప్పుడప్పుడు ఉన్నతాధికారుల్లా అవతారమెత్తుతాడు!