'దళారుల దందా.. టమాటా రైతుకేది అండ?' పేరిట ఈటీవీ భారత్‌లో వెలువడిన కథనానికి.. మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సి. రామాంజనేయులు, ఇంఛార్జి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఎం.దివాకర్ రావు, దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఆనంద్.. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని మోపిదేవిలంక, కోసురువారిపాలెంలో పర్యటించారు. టమాటా రైతులను కలిసి వారి సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కనీస గిట్టుబాటు ధరలేక.. టమాటా పంటను రైతులు నదిలో పారబొయ్యడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
దిగుమతి నిలిపివేశాం:
స్థానికంగా పండిన టమాటా విక్రయం పూర్తయ్యేవరకు.. జిల్లాలోని రైతుబజార్లకు ఇతర ప్రాంతాల నుంచి సరుకు దిగుమతి కాకుండా రైతు బజార్ ఎస్టేట్ అధికారులను ఆదేశించినట్లు రామాంజనేయులు తెలిపారు. కేవలం కృష్ణాలో పండిన టమాటాలు మాత్రమే రైతులు అమ్ముకునేలా.. ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. రైతు బజార్ కార్డులు లేనప్పటికీ పంటను విక్రయించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కిలో రూ. 14 చొప్పున ఎంతమందైనా రైతు బజార్‌కు తీసుకువెళ్లవచ్చన్నారు.
అంత వ్యత్యాసమా...?
పొలం దగ్గర కిలో టమాటాకి కేవలం రూ.4 మాత్రమే వస్తున్నాయని అధికారుల వద్ద రైతులు వాపోయారు. మార్కెట్ ధరకు, సాగుదారుడికి అందే డబ్బుకి రూ.10 వ్యత్యాసం ఉండటంపై.. స్థానిక మార్కెటింగ్ శాఖ అధికారుల మీద రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టమోటాలు కొనుగోలు చేసే వ్యాపారులతో వెంటనే సమావేశం నిర్వహించి.. ధరల్లో వ్యత్యాసం ఎక్కువ ఉండకుండా చూడాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
సంబంధిత కథనం: