ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సి ఉందని ఆరోగ్య సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఛైర్ పర్సన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి సుజాతారావు అన్నారు. ప్రాథమిక ఆరోగ్య భద్రతపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన కార్యశాలలో నిపుణుల కమిటీ సభ్యులు, ప్రాథమిక ఆరోగ్యంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
సామాజిక ఆరోగ్య కేంద్రాలు
రాష్ట్ర ప్రజలకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ వర్తించేలా సూచనలు చేయాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు కమిటీ పనిచేస్తుందన్నారు. తమిళనాడులో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పించారన్న అంశంపై ఆమె చర్చించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్ని బలోపేతం చేయాలన్నారు. సరిపడా సిబ్బంది, డాక్టర్లు వున్నప్పటికీ పని చేయడానికి సరైన సదుపాయాలు అందుబాటులో లేవన్నారు. ఆయా రోగులకు సంబంధించిన రికార్డులు లేకపోతే ఆరోగ్య పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
క్షేత్రస్థాయి పరిష్కారం
ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో, క్షేత్ర స్థాయిలో ఎలా పరిష్కరించాలో సూచించాలని ఆమె కోరారు. వెల్ నెస్ సెంటర్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సేవల్ని మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. గ్రామీణ ఆరోగ్య పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టాల్సి ఉందని సూచించారు.
స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను సుజాతారావు అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై ఉపయుక్తమైన సూచలివ్వాలని కోరారు. ఏపీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం శుభ పరిణామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : అవినీతి ఆరోపణలతో మండలిలో వాగ్యుద్ధం