వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధికార ప్రతినిధి బోండా ఉమ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఇస్తోంది కాపు నేస్తం కాదని.. కాపు దగా పథకమని ఆయన ఆరోపించారు. తెదేపా హయాంలో కోటి 50 లక్షల మంది కాపులకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 55 లక్షల మంది కాపు మహిళలు ఉంటే... కేవలం 2.36 లక్షల మందే ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారని మండిపడ్డారు.
ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 5 లక్షల మంది కాపు మహిళలు ఉన్నారని బోండా తెలిపారు. కాపుల చిరకాల కల 5 శాతం రిజర్వేషన్ కల్పించింది, కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. జగన్ సీఎం అయ్యాక కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని బోండా ఉమ విమర్శించారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్క లోను కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. చివరకు టైపిస్టులకు జీతాలు కూడా ఇవ్వకుండా... కార్పొరేషన్ ఆఫీసులకు తాళాలు వేశారని మండిపడ్డారు.