కృష్ణాజిల్లా నూజివీడులో శ్రీ గంధం చెట్లను నరికి తీసుకెళ్లటం హల్చల్ సృష్టించింది. దొంగలను పట్టుకోవటం పోలీసులకు పెను సవాలుగా మారింది. పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీ, ప్రశాంత్ నగర్, క్రిష్ణ విలాస్ కాలనీల్లోని ఇళ్లలో ఉన్న శ్రీ గంధం చెట్లు చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు ఐదు లక్షలు. ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను జామర్లతో ఆపి రాత్రి ఒంటిగంట సమయంలో దొంగతనానికి పాల్పడ్డారు.
ఇదే ప్రాంతానికి చెందిన ఓ బాధితురాలు మాట్లాడుతూ.. తాము పెంచుకున్న కోళ్లను కాల్చుకు తిని, మూడు మేకలను దుండగులు దొంగిలించినట్లు చెప్పారు. జీవనోపాధి కోసం వాటిని పెంచుతున్నామని.. తాము చాలా నష్టపోయామని వాపోయారు. చోరీ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కొందరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ చోరీ జరిగింది. దీంతో తమ ప్రాణాలకు రక్షణ ఎక్కడ ఉందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'దివిసీమలో 114 గ్రామ రక్షక దళాలు.. మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు'