CM Jagan Meet World Bank Representatives: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం సీఎం జగన్‌తో భేటీ అయ్యింది. భారత్‌లో ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ అగస్టే కుమే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో.. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో నడుస్తున్న ప్రజారోగ్యం, విద్య, నీటిపారుదల ప్రాజెక్టుల అమలుపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ వంటి కీలక రంగాల్లో మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రపంచబ్యాంక్ సమగ్ర అధ్యయనం చేయాలని కోరారు.
పలు అభివృద్ది అంశాలలో మరింత భాగస్వామ్యం కావాలని ప్రపంచ బ్యాంక్‌ను సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలోని స్కూళ్ల రూపు రేఖలు మారుస్తున్నామన్న జగన్.. వైద్యశాఖలో 40 వేల మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టామని.. ఉన్నత విధానాలు, సాంకేతికతలో సహకారం అందించాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులను సీఎం జగన్ కోరారు.
రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కేవలం ఆర్థికంగానే కాకుండా మంచి విధానాలను అమలు చేయడంలో, సాంకేతికంగా.. ఇలా వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలకు.. సమూల పరిష్కారాలను చూపే దిశగా ముందుకు సాగుతున్నామని, సహకరించాలని కోరారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.
ఏపీ ప్రజారోగ్య బలోపేతం, సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ టాన్ఫర్మేషన్ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ (ఏపీఐఐఏటీపీ) ఇలా వివిధ ప్రాజెక్టుల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రపంచ బ్యాంకు భారత్ విభాగానికి డైరెక్టర్ అగస్టే కుమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు పథకాలను ప్రశంసించారు. దేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు తాము రుణాలు ఇస్తున్నామని.. వివిధ రంగాల్లో వృద్ధికోసం ఈ రుణాలు ఇస్తున్నట్లు అగస్టే కుమే పేర్కొన్నారు. ఈరాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తమ భాగస్వామ్యం చాలా రోజులుగా కొనసాగుతోందని, వచ్చే పాతికేళ్లలో మీ విజన్‌కు, మీ మిషన్‌కు ఈ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2047 నాటికి దేశంలానే, రాష్ట్రం కూడా మంచి ఆదాయం ఉన్న రాష్ట్రంగా మారడానికి తగిన సహకారం, మద్దతు కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. విద్యారంగంలోనూ ప్రపంచబ్యాంకు రాష్ట్రంతో కలిసి పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో మంచి విధానాలు అమలవుతున్నాయన్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు.. ప్రపంచంలో ఇతర ప్రదేశాల్లో ఉన్న మంచి విధానాలపై సూచనలు చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
ఇవీ చదవండి: