గుంటూరు జిల్లా పొన్నూరు.. చేబ్రోలు మండలం.. శేకూరు గ్రామంలో నిత్యం మట్టి లారీలు తిరుగుతుండటం వల్ల తమ ఇళ్లలో దుమ్ము, ధూళి పేరుకుపోతోందని గ్రామస్థులు నిరసనకు దిగారు. పిల్లా పాపలతో కలిసి మహిళలు రోడ్డుపై టెంట్లు, కుర్చీలు వేసి ధర్నా చేపట్టారు. లారీలు ఓవర్ లోడ్‌తో అతి వేగంగా వెళ్తున్న క్రమంలో పరిసరాల్లో దుమ్ము లేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటిల్లిపాది ఆందోళన..
తక్షణమే ఆయా లారీలను నిలిపివేయాలని, ఇంటిల్లిపాది ఆందోళనకు దిగింది. గత నెలలో కూడా పిల్లలతో కలిసి మహిళలు ఆందోళన చేపట్టినప్పటీకీ ఎలాంటి మార్పు రాలేదని బాధితులు వాపోతున్నారు. ఆందోళన చేసిన 5 రోజులు తవ్వకాలు నిలిపివేశారని.. మళ్లీ యధేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారని మండిపడుతున్నారు. గత సోమవారం హనుమంపాలెంలో కూడా ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
కాలుష్యం బారిన పడితే..
వెంటనే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని తమ పరిస్థితి చూడాలని డిమాండ్ చేశారు. దుమ్ముతో పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమని పట్టించుకోకపోతే ఇక్కడికి ఇక్కడే బలవన్మరణానికి పాల్పడతామని మహిళలు హెచ్చరించారు. ఆడవాళ్లు కాకుండా మగవాళ్లు ఆందోళనలో పాల్గొంటే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే అధికారులు తమ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చూడండి : టీకా పంపిణీలో అట్టడుగున ఏపీ..ప్రణాళికా లోపమే కారణం: చంద్రబాబు