మంగళగిరిలో కాగడాలతో..
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు హత్యను నిరసిస్తూ మంగళగిరిలో తెదేపా నేతలు కాగడాల ప్రదర్శనలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు కాగడాల ర్యాలీ చేశారు. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తెదేపాకి చెందిన 19 మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారని.. ఆ కేసుల్లో ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోకపోవడంపై తెదేపా నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగడాల వలే ప్రతి కార్యకర్త గుండె రగిలిపోతోందని.. ఆ జ్వాలల్లో అధికార పార్టీ నేతలు కాలిపోకుండా చూసుకోవాలని తెదేపా నాయకులు హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ కులానికొక నాయకుడిని హత్య చేస్తున్నారని వారు ఆరోపించారు.
విజయవాడలో కొవ్వొత్తులతో..
ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ విజయవాడ మధ్య నియోజకవర్గంలో తెదేపా ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో కొవ్వొత్తులతో నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు 136 జరిగాయని.. ఒక్క ఘటనలో కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవడం శోచనీయమన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: దేవాలయాలపై దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు