గుంటూరు జిల్లాలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ రెడ్‌జోన్‌గా ప్రకటించారు. నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకూ 382 మంది నమూనాలు సేకరించగా 20 పాజిటివ్ వచ్చాయని, 264 నెగెటివ్ వచ్చాయని తెలిపారు. మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు పట్టణాలతో పాటు మేడికొండూరు మండలం తురకపాలెం గ్రామం... అలాగే గుంటూరు నగరంలోని మరికొన్ని ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించామన్నారు.
వైద్య సిబ్బందిని ఇబ్బందులు పెట్టినా... క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటను అడ్డుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, అక్కడ పని చేసే వైద్యులు, సిబ్బందిని కరోనా కట్టడి కోసం అత్యవసర సేవల పరిధిలోకి తెచ్చినట్లు వివరించారు. జిల్లాలో నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరకు అమ్ముతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని... ప్రత్యేక తనీఖీ బృందాలు ఏర్పాటు చేసి వాటిని కట్టడి చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. తూనికలు కొలతల శాఖ, ఆహార కల్తీ నియంత్రణ శాఖ, మార్కెటింగ్, రెవిన్యూ శాఖలతో కలిసి 13బృందాలు ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారులు ఎవరైనా నిర్దేశిత ధరలకు మించి అమ్మినా... తూకాల్లో మోసానికి పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.