కరోనా విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, వైద్యుల మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి తెలిపారు. కొవిడ్ నియంత్రణలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నవారు మహమ్మారి కాటుకు బలైపోతుండడం పట్ల ఆవేదన చెందారు. తిరుపతి, అనంతపురం నగరాల్లో ఇద్దరు సీఐలు కొవిడ్ బారిన పడి మరణించడం దురదృష్టకరమన్నారు.
గుంటూరు జిల్లాలో ఆర్ఎంవో తో పాటు.. రాష్ట్రంలో ముగ్గురు యువ వైద్య విద్యార్థులు కన్నుమూయడం బాధాకరమని చెప్పారు. కొవిడ్ నిబంధనల కారణంగా మృతి చెందిన వారి పేర్లతో కనీసం నివాళి అర్పించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు పోలీస్ అధికారులు అకాల మరణం మాటలకందని విషాదమన్నారు.
క్షేత్ర స్థాయిలో పని చేసే ప్రతి ఒక్కరూ ఏమాత్రం ఏమరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పైస్థాయి అధికారులు సైతం తమ సిబ్బంది ఆరోగ్యం విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత రక్షణ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు సిబ్బందికి అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కోరనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఉదారంగా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అధికారులకు, వైద్యులకు జనసేన తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి:
కొవిడ్ చికిత్సల పర్యవేక్షణ బాధ్యతలు.. సీనియర్ ఐఏఎస్లకు అప్పగింత