రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో ఉంది. సత్తెనపల్లి, పత్తిపాడు, నవులూరు, అవిశాయపాలెంలో కేసులు నమోదయ్యాయి. గత 10 రోజుల నుంచి చిన్న పట్టణాలు, గ్రామాల్లో కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జనం రోడ్ల మీదకు భారీగా వస్తున్నారు. ఇపుడు అన్నీ తెరిచాక వైరస్ నియంత్రణ అంత సులువైన విషయం కాదు. అందుకే ప్రభుత్వ నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.
గ్రామాల్లో నివసించే ప్రజలు.. చేతులు శుభ్రపరుచుకోవాలని తెలిపారు. పనిచేసే చోట.. మాస్కు ధరించి జాగ్రత్తలను పాటించాలని కలెక్టర్ తెలిపారు. మంచి ఆహారం తీసుకుంటూ.. కరోనా రాకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. మాల్స్, హోటళ్లు, ప్రార్దనా మందిరాల్లో భౌతిక దూరం పాటించాలని... కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు తెలిపేలా బోర్డులు ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
హోటళ్లలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు. హోటళ్లలో సమావేశ మందిరాలను, మాల్స్‌లో పిల్లల వినోద కేంద్రాలను మూసివేయాలన్నారు. ప్రార్థనా మందిరాల్లో విగ్రహాలను తాకడం, పవిత్రజలాలు చల్లడం, ఆలయాల్లో శఠగోపం పెట్టడం లాంటివి చేయొద్దని అధికారులు స్పష్టం చేశారు. హోటల్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ ప్రశాంతి సూచించారు. నిబంధనలు అతిక్రమించిన మాల్స్, హోటళ్లను మూసివేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: