గుంటూరు జిల్లా వ్యాప్తంగా జర్మన్ హ్యంగర్ టెక్నాలజీతో నాలుగు కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివేక్ యాదవ్ చెప్పారు. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో బాధితులు బెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా నరసరావుపేట, తెనాలి, జీజీహెచ్, ఐటీహెచ్ ప్రాంతాల్లో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 50 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి పరిశీలించారు. అక్కడ తొంభై శాతం పనులు పూర్తయ్యాయని… మిగతా కేంద్రాల్లో వారం రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఆక్సిజన్ సౌకర్యంతో…
జర్మన్ హ్యంగర్ టెక్నాలజీ కేంద్రంలో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పించినట్లు కలెక్టర్ వివరించారు. ఈ కేంద్రాన్ని అన్ని విధాలుగా వినియోగించుకోవాలని వైద్యులకు సూచించారు. అత్యవసర పరిస్థితులలో బాధితులను చేర్చుకుని.. వైద్యం అందించాలని తెలిపారు. చికిత్స అనంతరం ఐసోలేషన్ అవసరం ఉన్న వారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. డివిజన్ పరిధిలో ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారికైనా ఈ కేంద్రాల్లో అనుమతి ఉంటుందని వివరించారు. ఆసుపత్రి మాదిరిగానే ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. నాలుగు కేంద్రాల్లో… మొత్తం 150 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇక్కడ పరీక్షలు, ట్రాయాజింగ్, వెయిటింగ్, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి కూడా అవకాశముందన్నారు. ప్రజలు ఈ కొవిడ్ కేర్ కేంద్రాలను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఇదీ చదవండి: ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం: మంత్రి పెద్దిరెడ్డి