ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కు చేరింది. బుధవారం సాయంత్రం 7గంటల తర్వాత కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర నోడల్ అధికారి విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఈ వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 11 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. కొత్తగా అచ్చంపేట, క్రోసూరు మంగళగిరి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. నమోదైన పాజిటివ్ కేసులన్నీ దిల్లీకి వెళ్లివచ్చిన వారివేనని గుర్తించారు. దీంతో గుంటూరు జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితులు వారంరోజుల్లో ఎవరెవరిని కలిశారో అధికారులు గుర్తిస్తున్నారు. బాధితులు కలిసిన వారందరినీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా | కరోనా పాజిటివ్ కేసులు |
గుంటూరు | 20 |
కడప | 15 |
కృష్ణా | 15 |
ప్రకాశం | 15 |
పశ్చిమగోదావరి | 14 |
విశాఖపట్నం | 11 |
తూర్పుగోదావరి | 9 |
చిత్తూరు | 6 |
నెల్లూరు | 3 |
కర్నూలు | 1 |
అనంతపురం | 2 |
మొత్తం | 111 |
ఇదీ చదవండి: కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడింది: సీఎం జగన్