రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆచార్యులు, సహాయ ఆచార్యుల పోస్టులు అవసరం మేరకు భర్తీ చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ కళాశాలలో 22 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ వంగా గీత, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాతో కలసి నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. పరిశ్రమలు, విద్యాసంస్థలకు వారధిలా ఇన్నోవేషన్ సెంటర్లు పని చేస్తాయని చెప్పారు. ఉన్నత విద్యలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం చట్టం చేసినట్లు చెప్పారు. జీవో నెంబర్ 38 ప్రకారం గతేడాది ఫీజులే ఈ సంవత్సరం కూడా వర్తిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. జీతభత్యాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటైందన్నారు. తెదేపా ప్రభుత్వ వైఖరివల్ల కళాశాలలకు 1200 కోట్ల రూపాయలు ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలున్నట్లు చెప్పారు. స్కాలర్‌షిప్‌పైనే ఆధారపడిన కళాశాలలకు ఇది ఎంతో భారమని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:త్రివర్ణ శోభ... భారీ జాతీయ జెండా ప్రదర్శన