ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానంపై తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తెదేపా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వినూత్నంగా నిరసన తెలిపారు. కోరుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద నల్లచొక్కాలు ధరించి మద్యం కొనుగోలు చేశారు.
పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వ్యాపారాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మద్యం దుకాణాల వద్ద డిజిటల్ ఆర్థిక లావాదేవీలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఇంచుమించు నాటుసారాతో సమానమై మద్యం మాత్రమే ఇక్కడ దుకాణాల్లో అందుబాటులో ఉంటుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలాచోట్ల నివాస గృహాల మధ్యలోనే అమ్మకాలు చేపట్టడం చాలా దారుణం అన్నారు.
గత ప్రభుత్వంలో రూ.70కి అమ్మిన మద్యం బాటిల్ ప్రస్తుత ప్రభుత్వం రూ.180 అమ్మడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల విధానాల్లో తక్షణమే మార్పులు చేసి, నాణ్యమైన మద్యాన్ని, గత ప్రభుత్వం అందించిన విధంగా తక్కువ ధరకే అందించాలని డిమాండ్ చేశారు. శ్రామిక, కార్మిక వర్గాలకు 90 ఎంఎల్ నాణ్యమైన మద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. 'అమరావతి ఉద్యమం చేస్తున్న వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే'