NEW DISTRICTS AGITATIONS: మదనపల్లెని జిల్లా కేంద్రం చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కౌన్సిల్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఉదయాన్నే పోలీసులు కార్యాలయం చుట్టూ ఇనుప ముళ్లకంచెలు ఏర్పాటు చేసి లోనికి ఎవరినీ అనుమతించకుండా జాగ్రత్త తీసుకున్నారు. తెలుగుదేశం, జనసేన, మదనపల్లె జిల్లా సాధన సమితి, మదనపల్లి జిల్లా సాధన జేఏసీ నాయకులు..పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. కొందరు కార్యాలయం పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనుకూలమైన అంశాలు ఉన్న మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో...
బాలాజీ జిల్లాకు నాయుడుపేటను జిల్లా కేంద్రంగా చేయాలని ఏపీ యువజన విభాగం జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరులో ధర్నా నిర్వహించారు. బాలాజీ జిల్లా కేంద్రంగా తిరుపతిని చేయడం అన్ని నియోజకవర్గాలకు దూరమన్నారు. తద్వారా ప్రజలు ఇబ్బంది పడతారని వెల్లడించారు. అన్నింటికి దగ్గరగ ఉన్న నాయుడుపేటనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కడప జిల్లాలో..
రాజంపేట జిల్లా కేంద్రం సాధనే లక్ష్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. వచ్చే నెల 10లోగా ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రితో ప్రకటన చేయించకుంటే పదవులు వదిలి ఉద్యమంలోకి రావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పదవులే ముఖ్యమని భావిస్తే ప్రజలు మీపై పోరాటానికి దిగుతారని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. స్థానిక కాలేజ్ రోడ్డు నుంచి ర్యాలీగా బయలుదేరి కంభం కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. మార్కాపురం పట్టణాన్ని.. జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.. ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.