అనంతపురం కార్పొరేషన్లోని 50 డివిజన్లలో, జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది. 10 మున్సిపాలిటీల్లో 21 వార్డులు ఏకగ్రీవం కాగా, 287 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 8,81,895 మంది పట్టణ, నగర ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక కాలనీల్లో భద్రతా మరింత పెంచారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హిందూపురంలో..
పోలింగ్ సందర్భంగా బందోబస్తు చర్యలను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పర్యవేక్షించారు. పట్టణంలోని మోతుకపల్లి వద్ద పోలింగ్ సరళిని పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా నలుగురు ఏఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 150 మంది ఎస్సైలతో పాటు 4,500 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా 119 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 1,20,764 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కదిరిలో..
మున్సిపాలిటీలో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని 36 వార్డులకు 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 75,481 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, కుటాగుళ్ల, నిజాంవలి కాలనీ ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరారు.
పట్టణంలోని ఆరో వార్డులో తెదేపా, 23వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లను పోలింగ్ కేంద్రాలకు అనుమతించలేదని వారి మద్దతుదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 32వ వార్డులో వైకాపా, సీపీఐ నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఓటర్లకు స్లిప్పులు ఇచ్చే విషయంలో పరస్పరం వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రెండు పార్టీల వారిని పంపివేశారు.
రాయదుర్గంలో..
పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎన్నికల అధికారులు 32 వార్డులకు గాను 64 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 50 వేల 887 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ప్రశాంతంగా వినియోగించుకోవడానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఓటర్లకు స్లిప్పులు ఐడీ కార్డులు లేవని అరగంట పాటు ఓటర్లను అనుమతించలేదు. దీంతో తెదేపా, వైకాపా ఏజెంట్లు, ఓటర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు ఓటు వేసేందుకు పోలింగ్ అధికారి అనుమతించారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. 20వ వార్డులో వైకాపా అభ్యర్థి సంజీవ్ ఓటర్లను స్వయంగా ఆటోలో ఎక్కించి పోలింగ్ కేంద్రాలకు పంపున్నాడు. ఆటోకు సీఎం జగన్ స్టిక్కర్ అతికించి ఓటర్లను తరలిస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
అనంతపురంలో..
నగరంలో పోలింగ్ కేంద్రం వద్ద బియ్యం పంపిణీ వాహనాలు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న పోలింగ్ సెంటర్లో రెండు బియ్యం పంపిణీ వాహనాలను ఉంచారు. వాటిపై ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల చిత్రాలు కనపడకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, అధికారులు ఉన్నఫలంగా అక్కడున్న ఒక వాహనాన్ని తరలించి మరో వాహనానికి కవర్ కప్పి ఉంచారు.
అరవింద నగర్లో ఓటు హక్కు వినియోగించుకోటానికి ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు. గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని 6,7,8 వార్డులు, గుత్తి పట్టణంలోని 15వ బ్లాక్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయటానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలింగ్ ప్రారంభం కాగానే వృద్ధులు కూడా కుటుంబ సభ్యుల సహాయంతో ఓటు వేసేందుకు వస్తున్నారు.
తాడిపత్రిలో..
పట్టణంలో 36 వార్డులు ఉన్నాయి. వీటిలో 22, 31వ వార్డులు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 34 వార్డులకు గాను 78 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు తరలి వెళ్తున్నారు. పది గంటలకు 15.77 శాతం పోలింగ్ నమోదైంది. జాయింట్ కలెక్టర్ సిరి.. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. డీఎస్పీ వి.ఎన్. కే. చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మున్సిపాలిటీలోని 17వ వార్డులో ఓటు వేసేందుకు జనం బారులు తీరారు. పోలింగ్ ప్రారంభానికి అరగంట ముందే నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఓటర్ల రాకను ముందుగానే అంచనా వేసిన అధికారులు వరుసల్లో నిలబడటానికి అవసరమైన బారికేడ్లు ఏర్పాటు చేశారు.
పుట్టపర్తిలో..
నగర పంచాయతీలోని 31 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 6:30 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి బారులు తీరారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
మడకశిరలో..
నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డుల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం కాస్త మందకొడిగా పోలింగ్ సాగింది. అన్నీ వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
గుంతకల్లులో...
పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. పట్టణంలోని 34 వార్డుల్లో.. 97,940 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల మేర వాహన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. గుంతకల్లులోని పది సమస్యాత్మక ప్రాంతాలు.. అందులో ఏడు అతి సమస్యాత్మక ప్రాంతాలుగా ఉండటంతో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
95 పోలింగ్ స్టేషన్లలో 475 మంది మున్సిపాలిటీ సిబ్బందితో పాటు ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, తొమ్మిది ఎస్సైలు, 410 స్పెషల్ ఫోర్స్ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. రాజేంద్ర ప్రసాద్ పురపాలక ప్రాథమిక విద్యాలయం వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు,మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోని ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద సరైన వసతులు లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డ్, రాజేంద్రనగర్, అంబేద్కర్ నగర్లోని పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఏర్పాట్లు చేయకపోవటంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి రెండు గంటల వరకు 9.69శాతం పోలింగ్ నమోదైంది.
ఇదీ చదవండి: 'ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం.. స్వేచ్ఛగా ఓటేయండి'