Current shock:ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటున్న అన్నదమ్ములను చూసి విధికి కన్ను కుట్టినట్లుంది.. విద్యుత్తు రూపంలో ఇద్దరినీ ఒకే రోజు బలి తీసుకుంది. అనంతపురం కణేకల్లు మండలం 43ఉడేగోళం గ్రామంలో ఆదివారం నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లిన సోదరులు రమేష్ (34), దేవేంద్ర (28) విద్యుదాఘాతంతో మృతి చెందారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచి యల్లప్ప పెద్ద భార్య కుమారుడు దేవేంద్ర, చిన్న భార్య కుమారులు రమేష్, వన్నూరుస్వామి ముగ్గురు కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి పంపుసెట్టు ద్వారా నారుమడికి నీరు పెట్టేందుకు చూశారు. రమేష్ మోటారుకు అమర్చిన వదులుగా ఉన్న పైపును గట్టిగా అదిమి పట్టుకోగా.. దేవేంద్ర మోటారును స్టార్ట్ చేశారు. దీంతో రమేష్ విద్యుదాఘాతానికి గురయ్యారు. పక్కనే ఉన్న దేవేంద్ర అతడిని పట్టుకోవడంతో ఇద్దరూ మోటారుపై పడిపోయారు. అన్నదమ్ములను కాపాడేందుకు ప్రయత్నించగా వన్నూరుస్వామికీ షాక్ కొట్టి సొమ్మసిల్లి పడిపోయారు. కాసేపటికి తేరుకుని విషయాన్ని ఫోన్‌లో కుటుంబ సభ్యులకు తెలిపారు. స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వన్నూరుస్వామికి ప్రథమచికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం బళ్లారికి తరలించారు.
ఇవీ చూడండి: