Chain Snatching Caused baby death : జనగామ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. అంబేడ్కర్ నగర్‌లో రోడ్డుపై వెళ్తున్న ప్రసన్న అనే మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగిలించడానికి ఓ దుండగుడు ప్రయత్నించాడు. గొలుసు చోరీని అడ్డుకునేందుకు ఆ మహిళ పెనులాడింది. ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న పాపను తీసుకుని పక్కనే ఉన్న నీటి సంపులో పడేసి వెళ్లిపోయాడు ఆ దుండగుడు.
దుండగుడి దుశ్చర్యకు షాకైన ప్రసన్న తేరుకుని పాపను రక్షించడానికి ప్రయత్నించి విఫలమైంది. స్థానికుల సాయంతో నీటిసంపులో నుంచి పాప తేజస్వినిని బయటకు తీసింది. అప్పటికే ఆమె మరణించింది. అయినా ఆశ కోల్పోని ఆ తల్లి వెంటనే జనగామ ఎంసీహెచ్‌కు తరలించింది. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. మంగళసూత్రం కోసం చూసుకుంటే.. తన కన్నబిడ్డ తనకు దూరమైపోయిందని గుండెలవిసేలా రోదించింది. ఆమె రోదనలు విన్న స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది కంటతడి పెట్టారు.
అనంతరం మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు. దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహిళ మెడలో నుంచి చైన్ దొంగిలించేందుకు ప్రయత్నించిన ప్రాంతంలో సీసీటీవీలు ఉన్నాయో లేదో ఆరా తీస్తున్నారు. వీలైనంత త్వరలో నిందితుణ్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి :