రానున్న 30, 40 ఏళ్లలో భారతదేశం ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్( విశాఖ ఉక్కు కర్మాగారం) ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న సైన్స్ వారోత్సవాల ముగింపు సమావేశంలో భట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 19వ శతాబ్దంలో ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో 50 శాతం అమెరికా చేపట్టిందని.., 1950 దశకంలో ఐరోపా ఖండంలో 50 శాతం ఉక్కు ఉత్పత్తి జరిగేదని అన్నారు.
ఏదైనా దేశం అభివృద్ధి జరగాలంటే ఉక్కు ఉత్పత్తితోనే ముడిపడి ఉంటుందని అతుల్ భట్ వివరించారు. 2000 నుంచి 2010 వరకు చైనా అత్యధిక ఉత్పత్తి చేయడంతో పాటు, ఉక్కును అత్యధికంగా వినియోగించిందని అని భట్ తెలిపారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని ఉక్కు కర్మాగారాల నిర్వహణలో అత్యధికంగా భారతీయులు కీలక భూమికను పోషిస్తున్నారని అతుల్ భట్ అన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పీవీజీడీ ప్రసాదరెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎన్టీపీసీ సీజీ ఎం. దివాకర్ కౌశిక్, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వి. కృష్ణమోహన్, రెక్టార్ సమత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
TTD Board Members Case: 'స్టే' ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఎలా తీసుకొచ్చారు: హైకోర్టు