లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా సాయాన్ని వైకాపా నాయకులే పంపిణీ చేయడాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పవన్ కల్యాణ్ దృశ్య, శ్రవణ మాధ్యమ సమీక్ష నిర్వహించారు.
కరోనాను అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతో పేద వర్గాలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు పార్టీపరంగా అండగా నిలవాలని పవన్ నేతలకు పిలుపునిచ్చారు. ప్రధాని సూచనలను బాధ్యతాయుతంగా పాటించాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం, రోజువారీ కూలీలు, చిన్నపాటి వృత్తుల్లో ఉన్నవారు, పేద వర్గాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను, రైతుల సమస్యలను పార్టీ నేతలు పవన్ దృష్టికి తీసుకొచ్చారు.
చేతి వృత్తులవారు, ఆటో డ్రైవర్లు, హాకర్లు ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం విపత్కర తరుణంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదని... సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలని పవన్ కల్యాణ్ నేతలకు సూచించారు. లాక్ డౌన్ తరవాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదామని...పేద కుటుంబాలకు రూ.వెయ్యి పంపిణీ చేసిన తీరు, స్థానిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల నగదు పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇవీ చదవండి: 'ఉదయం 9 గంటల వరకే అనుమతి..అతిక్రమిస్తే చర్యలే'