తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మణుగూరుకు చెందిన ఓ వృద్ధురాలు శనివారం కరోనాతో మృతి చెందింది. మణుగూరులోని గట్టు మల్లారం కాలనీకి చెందిన వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రావడం వల్ల భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ఈ రోజు మృతి చెందింది. ఆమెకు కరోనా లక్షణాలు ఉండడం వల్ల జులై 27న భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. వృద్ధురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఐసోలేషన్ వార్డులో చేర్పించి వెళ్లిపోయారు. ఈరోజు ఆమె మృతి చెందడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ యుగంధర్ వృద్ధురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వారు మృతదేహాన్ని తీసుకువెళ్లమని చెప్పారు. కనీసం కడసారి చూడడానికి కూడా కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. దీంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ యుగంధర్, తహసీల్దార్ నాగేశ్వరరావు, డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందితో కలిసి భద్రాచలంలో అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా రావడం వల్ల కుటుంబ సభ్యులు బంధువులు ఎవరూ హాజరు కాకపోవడం వల్ల చివరికి అనాథ శవంలా అంత్యక్రియలు జరిగాయి.
ఇవీ చూడండి: మోదీ కోసం 'జై శ్రీరామ్' సందేశంతో ప్రత్యేక వస్త్రం