రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి ఆఫ్రికా దేశంలో కంటే అత్యంత అధ్వాన్నంగా ఉందంటూ జనసేన పార్టీ అధికారికంగా ఓ వీడియోను రూపొందించింది. 'ఆంధ్ర రోడ్లు ఆగమాగం' పేరిట ఆ వీడియోను సామాజిక మాద్యమాల్లో విడుదల చేసింది. ప్రపంచ దేశాలతో మౌలిక రంగంలో మన దేశం పోటీపడుతూ.. భారతమాల పేరిట దేశం నలుమూలల కొత్త జాతీయ రహదారులను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం నాణేనికి ఒకవైపుగా ఉందని పేర్కొంది.
కానీ.. రహదారుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఘోరంగా ఉందని విమర్శించింది. ఏటా వేల కోట్ల రూపాయల నిర్వహణ నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించింది. గుంతల రోడ్లతో ప్రజలు ఆసుపత్రుల పాలవడం నిత్యకృత్యం అవుతోందని.. ప్రజలు చేసిన పాపమేంటంటూ నిలదీసింది. దేశంలోని అధ్వాన రహదారుల్లో మనం రాష్ట్రం మొదటి పది స్థానాల్లో ఉందని తెలిపింది.
నిధులు ఎటుపోతున్నాయ్..?
మరమ్మతులకు ఇచ్చిన నిధులు ఏమయ్యాయని.. రహదారుల సెస్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తోన్న నిధులు ఏం చేస్తున్నారని జనసేన ప్రశ్నించింది. అంతులేని అవినీతితోపాటు ఆర్థిక నిర్వహణ చేతకాక నిధుల సమస్య తలెత్తుతోందని.. పాత బకాయిలు చెల్లించకపోవడంతో.. గుత్తేదారులు కొత్తగా రహదారుల పనులకు టెండర్లు వేసేందుకు ముందుకు రావడంలేదని జనసేన పార్టీ తెలిపింది.
ఇటువంటి పరిస్థితి దేశంలో మరెక్కడా లేదని పేర్కొంది. పార్టీ రూపొందించిన వీడియోలో పత్రికల్లో రహదారుల పరిస్థితిపై ప్రచురించిన కథనాలతోపాటు.. దారుణంగా దెబ్బతిన్న రోడ్ల దృశ్యాలను పొందుపరిచింది. రోడ్ల మరమ్మతుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జనసేన ఉద్యమబాట పట్టబోతోందని.. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర రోడ్ల దుస్థితిపై డిజిటల్ వేదికల ద్వారా ఉద్యమ నిర్వహణకు సన్నాహకంగా ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది.
ఇదీ చదవండి: