తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగంగా దర్శనం కల్పించేందుకు తితిదేలోని అన్నివిభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నందున.. సర్వ దర్శనం, టైంస్లాట్ దర్శనాలు కొనసాగిస్తామని వైవీ స్పష్టం చేశారు. నడక దారి భక్తులకు త్వరలో టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు.
తిరుమల బాలాజీ నగర్ వద్ద 2.86 ఎకరాల స్ధలంలో ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గాన్ని పునరుద్ధరించి మే 5 నుంచి భక్తులను అనుమతిస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు కొత్త బంగారు సింహాసనాలకు బంగారు పూత పోయడానికి రూ.3.61 కోట్లతో టెండర్ల ద్వారా అనుమతి మంజూరు చేశామన్నారు. శ్రీనివాస సేతు రెండో దశ పనులకు రూ.100 కోట్లు కేటాయించామని వైవీ వెల్లడించారు. 2023 మార్చి నాటికి రెండవ దశ పనులు పూర్తి చేస్తామన్నారు.
తిరుమలలోని తితిదే ఉద్యోగుల వసతిగృహలను ఆధునీకీకరణకు రూ.19.40 కోట్లు కేటాయించామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తితిదేలో నగదు విరాళమిచ్చిన భక్తులకే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని ఇకపై వస్తు రూపంలో విరాళాలు అందించే దాతలకు కూడా ప్రత్యేక సౌకర్యాలు వర్తింపచేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి: తిరుమల కొండపై సినిమా పాటలు.. విస్మయానికి గురైన భక్తులు