రైతులు పండించిన పంటలను మార్కెట్ ధర ప్రకారం విక్రయించుకునేందుకు ప్రభుత్వం కల్పించిన వ్యవస్థే మార్కెట్ యార్డులు. అయితే వివిధ కారణాలతో చాలామంది రైతులు పంటను నేరుగా వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీనికి గల కారణాలపై లోతైన విశ్లేషణ చేసిన మార్కెటింగ్ శాఖ ... రైతులకు యార్డులను దగ్గర చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఆయా ప్రాంతాల్లో రైతులు పండించే పంటలు... వాటికి సంబంధించి వ్యాపారులతో సంప్రదింపులు, ఈనాం విధానంలో అమ్మకాలు, కొనుగోళ్లు జరపటంపై పలు సమావేశాలు జరిపి చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపై ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మార్కెట్ యార్డుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో మరో 25 కొత్త మార్కెట్ యార్డులు ఏర్పాటు కానున్నాయి. కొత్త యార్డుల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డులను వికేంద్రీకరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాలకమండళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ... ప్రభుత్వం ఇటీవలే బిల్లు తెచ్చింది. ఆ మేరకు సగం పాలకమండళ్లకు మహిళలు సారథులు కానున్నారు.
మార్కెట్ కమిటీలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులను గౌరవ ఛైర్మన్లుగా నియమిస్తూ... ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యేలకు మార్కెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కల్పించటం ప్రభుత్వ ఉద్దేశం. ఆ మేరకు ప్రతి నియోజకవర్గానికి మార్కెట్ యార్డు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి