గుంటూరులో కంటైన్‌మెంట్‌గా గుర్తించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలెవరూ బయటకు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు మొబైల్ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే సరఫరా చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 126 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 89 కేసులు గుంటూరు నగరంలోనే నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇంకా చాలామంది కొవిడ్ అనుమానితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరుణంలో గుంటూరు వైద్య కళాశాల ప్రాంగణంలోని ప్రయోగశాలకు అదనంగా మరో నాలుగు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. నరసరావుపేట, మాచర్ల, తెనాలి, గుంటూరులో ఏర్పాటు చేసిన కొత్త ల్యాబ్‌ల ద్వారా రోజుకు 400 నమూనాలు పరిశీలించవచ్చని అధికారులు తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 4వేల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 1900 మందికి నెగెటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మరో 1900 మందికి పైగా నివేదికలు రావాల్సి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే 500 మంది నమూనాలు ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ల్యాబ్‌ల సంఖ్య పెరగ్గా నివేదికలు త్వరగా వచ్చే అవకాశం ఉందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు జిల్లాలో కరోనా వైరస్ బారిన పడిన బాధితులు, అనుమానితులు గుంటూరులోని ఐడీ ఆసుపత్రి, కాటూరి వైద్య కళాశాలతోపాటు ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి బంధువులు, సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్ కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 16 వందల మందికి పైగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో 572కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు