దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత 48 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారొచ్చని అంచనా వేసింది. ఉత్తర ఈశాన్య దిశగా అండమాన్ నికోబార్ దీవుల తీరం వెంబడి ఏప్రిల్ 30 నుంచి మే 3 మధ్య కదులుతుందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
రాగల 48 గంటల్లో వర్షాలు
రాష్ట్రంలో వచ్చే 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి వానలు కురుస్తాయని వెల్లడించారు.
పిడుగులు.. 43 డిగ్రీలకు పైగా ఎండలు
వచ్చే మూడురోజుల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. రాబోయే 48 గంటల్లో రాయలసీమలో 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీలు.. అంతకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి..