కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటిబాడీస్ సమృద్ధిగా వృద్ధి చెందాలంటే తప్పక రెండు డోసులనూ తీసుకోవాల్సిందేనని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. త్వరలో కొవిడ్ టీకాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. టీకాల పంపిణీ, పొందడంలో సందేహాలు, అపోహలపై శ్రీనివాసరావుతో ‘ఈనాడు-ఈటీవీభారత్’ ప్రత్యేక ముఖాముఖి.
- కొవిడ్ టీకా తొలివిడత పంపిణీ ప్రణాళిక ఏమిటి ?
టీకాలను ఎవరెవరికి ఇవ్వాలో కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వైద్యసిబ్బంది.. పోలీసు, రెవెన్యూ, పురపాలక సిబ్బంది.. 50 ఏళ్ల పైబడినవారు.. 18-50 ఏళ్లలోపు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి తొలివిడతలో టీకాలు ఇవ్వనుంది. మన రాష్ట్రంలో ఈ నాలుగు కేటగిరీల్లో సుమారు 75 లక్షల మంది ఉంటారని అంచనా. వీరికి 10 వేల కేంద్రాల్లో.. 10 వేల బృందాలతో టీకాలందించడానికి ఏర్పాట్లు చేశాం. అయితే ప్రస్తుతం మాత్రం ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసిబ్బందికి ఇవ్వనున్నాం. వీరు సుమారు 2.90 లక్షల మంది ఉన్నారు. వీరి సమాచారాన్ని ఇప్పటికే కొవిన్ యాప్‌లో పొందుపరిచాం. ఆ తర్వాత పోలీసు, రెవెన్యూ, పురపాలక..సైనిక సిబ్బందికి అందజేస్తాం. ఇందుకోసం మొదటి దఫాలో 1,500 టీకా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నాం. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ 100 మందికి పైగా వైద్యసిబ్బంది ఉంటే.. వారికి ఆయా ఆసుపత్రుల్లోనే కేంద్రాలను నెలకొల్పి టీకాలను అందిస్తాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు ఇచ్చినా, ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలో అక్కడి సిబ్బంది సహకారంతో ఇస్తారు. తొలి రెండు వారాల్లో వైద్యసిబ్బందికి టీకాలను అందజేస్తాం.
- మిగిలిన రెండు కేటగిరీల వారికి ఎప్పుడు ప్రారంభిస్తారు ?
ఇప్పుడున్న నిబంధనల ప్రకారం.. 50 ఏళ్ల పైబడినవారిని ప్రభుత్వమే ఓటరు కార్డుల ఆధారంగా గుర్తిస్తుంది. వైద్యసిబ్బందే వారి సమాచారాన్ని కొవిన్ యాప్‌లో పొందుపరుస్తోంది. మరో విధానంలో ఎవరికి వారే కొవిన్ యాప్‌లో స్వీయ నమోదు చేసుకోవచ్చు. ఈ రెండు విధానాల్లోనూ మొబైల్ ఫోన్‌కు సంక్షిప్త సందేశం వస్తుంది. టీకా ఏ తేదీన? ఎక్కడ తీసుకోవాలో అందులో స్పష్టంగా ఉంటుంది. వేర్వేరు ప్రభుత్వ పథకాల పరిధిలో చికిత్స పొందుతున్న 18-50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జాబితాను కూడా గుర్తిస్తారు. ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు పరిస్థితులకు తగ్గట్లుగా టీకా పంపిణీ కేంద్రాల సంఖ్యను 10 వేలకు పెంచుతాం. రాష్ట్రంలో నిర్దేశించిన 75 లక్షల మందికి టీకాల ప్రక్రియ రెండుడోసులూ పూర్తి కావాలంటే.. కనీసం జూన్, జులై వరకూ సమయం పడుతుంది.
- టీకా పొందిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలా ?
కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. టీకా ఇచ్చేది ఒకవేళ వైరస్ సోకినా.. ప్రభావం తీవ్రంగా ఉండకుండా చూడడం కోసం మాత్రమే. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా వైరస్ సోకే అవకాశాలున్నాయి. అయితే వారిలో అప్పటికే టీకా ద్వారా యాంటిబాడీస్ వృద్ధి చెంది ఉంటాయి కాబట్టి.. ఆ వైరస్‌ను నిలువరిస్తాయి. అయితే ఆ వ్యక్తికి వైరస్ ద్వారా ప్రమాదం లేకపోయినా..తన ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందించే అవకాశాలుంటాయి. అందువల్ల మాస్కు ధరించడం తప్పనిసరి. పైగా టీకా వల్ల ఎన్నిరోజుల వరకూ యాంటిబాడీస్ రక్షణ ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం.
- టీకా పొందడానికి ముందు ఏమైనా ఆహార నియమాలు పాటించాలా ?
టీకా తీసుకోవడానికి ముందు గానీ.. తర్వాత గానీ.. ఎటువంటి ఆహార నియమాలు పాటించనక్కర్లేదు. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లుంటే.. వాటిని తీసుకోకుండా టీకా పొందడం మంచిది.
- కొవిడ్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు తీసుకోవచ్చా ?
కరోనా ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు టీకా తీసుకోవద్దు. ఇన్‌ఫెక్షన్ తగ్గిన తర్వాత తీసుకోవచ్చు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఇదే వర్తిస్తుంది. ఇప్పటికే కొవిడ్ వచ్చి తగ్గిన వారు కూడా తీసుకోవడమే సురక్షితం. దీనివల్ల ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే రోగనిరోధక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది.
- టీకా తీసుకునే ముందు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలా ?
అవసరం లేదు. ఒకవేళ జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలుంటే మాత్రం కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి. నెగిటివ్ వచ్చినా.. లక్షణాలు తగ్గిన తర్వాతే టీకా పొందాలి.
- కదల్లేని వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ?
వృద్ధాశ్రమాల్లో ఉంటున్నవారిని టీకా కేంద్రాలకు తరలించి, వైద్యుల సమక్షంలోనే ఇవ్వడానికి కృషిచేస్తాం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేస్తుంది. ఎందుకంటే ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స ఇవ్వాల్సి వచ్చినా.. వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. అస్సలు కదల్లేని వారికి మాత్రం.. వారున్నచోటనే టీకాలిస్తారు. అయితే వైద్యసిబ్బంది పూర్తి జాగ్రత్తలు తీసుకొని టీకాలిచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
- ప్రత్యేకంగా ఫలానా వ్యక్తులు టీకా వేయించుకోకూడదనే నిబంధన ఏమైనా ఉందా ?
ప్రస్తుతమున్న సమాచారం మేరకు 18 ఏళ్లలోపు వారు కొవిడ్ టీకా తీసుకోకూడదు. ఆ వయసు వారిపై ఎలాంటి ప్రయోగాలు చేయకపోవడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల వారికి ఇవ్వడం లేదు. గర్భిణులకు కూడా ఇవ్వడం లేదు. అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నవారు దీర్ఘకాలం రోగనిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వాడుతుంటారు. వీరు కూడా తీసుకోవద్దు. మున్ముందు ఒకవేళ వీరికి కూడా ఇవ్వాలనుకుంటే.. నిపుణులైన వైద్యులు పరీక్షించి, అవసరమని భావిస్తే.. వైద్యనిపుణుల సమక్షంలో పొందాల్సి ఉంటుంది.
- టీకా ఉచితమేనా ?
ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు కేటగిరీల వారిలో అర్హులైన వారికి కొవిడ్ టీకాను ఉచితంగా అందజేస్తారు.
- మొదటి డోసు తీసుకొని రెండో డోసు తీసుకోకపోతే ?
రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే యాంటిబాడీస్ పూర్తిస్థాయిలో వృద్ధి చెందుతాయి. తొలిడోసు తీసుకున్న 28 రోజులకు రెండోడోసు వేయించుకోవాలి. ఒకవేళ రెండో డోసును నిర్దేశిత తేదీన తీసుకోలేకపోతే.. ఆ తర్వాత 2-4 రోజుల్లోపు తప్పనిసరిగా తీసుకోవాలి.
- ఒక డోసు ఒక రకం టీకాను.. రెండో డోసు మరొకటి తీసుకోవచ్చా ?
అలా తీసుకోకూడదు. తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి సమాచారాన్ని కొవిన్ యాప్‌లో పొందుపరుస్తారు. ఆ వ్యక్తికి ఏ టీకాను, ఎప్పుడు ఇవ్వాలి? ఏ తేదీన తొలి డోసు? ఏ తేదీన రెండో డోసు? ఏ కేంద్రంలో ఇవ్వాలి? తదితర సమాచారమంతా కూడా ఆన్‌లైన్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ సమాచారం టీకా పొందే వ్యక్తికి కూడా చేరుతుంది. వీటిని సరిచూసుకున్న తర్వాతే టీకా ఇస్తారు. బహిరంగ విపణిలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
- టీకాలు ఏమేరకు సురక్షితం ?
ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో టీకాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు అనుమతించినా.. ఇప్పటి వరకూ ఏ వ్యాక్సిన్‌తో కూడా ఎవరూ చనిపోయినట్లుగా నమోదు కాలేదు. కాబట్టి ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. అత్యంత సురక్షిత విధానంలో టీకాను తయారుచేశారు. అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాతే ప్రభుత్వం ఆమోదించింది. అందరూ తప్పకుండా టీకా వేసుకోవాలి. టీకా పొందిన తర్వాత ఏమైనా దుష్ఫలితాలు కనిపించినా.. వెంటనే చికిత్స అందించేందుకు 10వేల కేంద్రాల్లోనూ కిట్లను అందుబాటులో ఉంచనున్నాం. మరింత మెరుగైన వైద్యం అవసరమైతే ఉన్నత స్థాయి ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా టీకా కేంద్రాల్లో అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంటాయి.