ఈశాన్య భారతదేశంలోని దేశవాళీ నల్ల వంగడాలను రాష్ట్రంలో సాగు చేస్తున్న సన్నరకం వరి విత్తనాలతో సంకరం చేసి బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం వారు కొత్త విత్తనాన్ని అభివృద్ధి చేశారు. కొత్త వంగడం ధాన్యం సన్నగా ఉండటంతోపాటు నల్లధాన్యంలో ఉన్న పోషక విలువలు కూడా ఉన్నాయి. బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం అభివృద్ధి చేసిన వంగడాన్ని చిరుసంచుల ద్వారా రెండు సీజన్లకు రైతులకు అందించారు. రాష్ట్రంలోని పది జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సాగుచేశారు. ఇందులో ఆశించిన ఫలితాలు రావడంతో రైతుల నుంచి విత్తనాలకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది మరికొంత మందికి చిరుసంచుల్లో విత్తనాలు సరఫరా చేయడానికి పరిశోధనా స్థానం ప్రణాళిక సిద్ధం చేసింది. దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, తుపాన్లను తట్టుకుని నిలబడటం, నల్లధాన్యంలో ఉన్న పోషక విలువలు ఉండటంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
బీపీటీ 2841 వరి రకం ధాన్యం నుంచి తీసే బియ్యం పైపొర నలుపురంగులో ఉంటుంది. బియ్యానికి పైపొరలలోని నలుపు రంగు ఆంధోసైనిన్ అనే పదార్థం వల్ల వస్తుంది. సాధారణంగా మనం రోజూ ఆహారంగా తీసుకునే వరి రకాలతో పోల్చినప్పుడు నలుపు, ఊదా, ఎరుపు రంగు పైపొరగా కలిగిన వరి రకాలలో పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. నల్లబియ్యం పైపొరలలో ఉండే ఆంధోసైనిన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సూపర్ పుడ్‌గా పిలిచే బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్‌తో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో సమానమైన పోషక విలువలను కలిగి ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఉత్పత్తి అయిన ఫ్రీరాడికల్స్‌ను సమతుల్యం చేయడం వల్ల పలురకాల క్యాన్సర్లు, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.
బీపీటీ-2841 లక్షణాలు
* 130 నుంచి 140 రోజులు దీని పంటకాలం
* హెక్టారుకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
* పైరు సుమారు 110సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది.
* దోమ, అగ్గితెగులును తట్టుకుంటుంది
*ధాన్యం సన్నగా ఉండి 1000 గింజల బరువు సుమారు 14 నుంచి 14.5 గ్రాములు ఉంటుంది
* అమైలోజ్ 23.5 శాతం, ప్రొటీన్ 11.02 శాతం, జింకు 24.3 పీపీఎం, ఇనుప ధాతువు 15.6 పీపీఎం ఉంటుంది.
* మనం రోజూ తీసుకునే సాంబమసూరి(బీపీటీ 5204) ముడిబియ్యంతో పోల్చినప్పుడు ఇందులో 3-4 రెట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.
* ఆరోగ్యానికి మేలు
అన్ని రకాల భూముల్లోనూ సాగు
దేశవాళీ రకాలు, స్థానికంగా మనం పండిస్తున్న సన్న ధాన్యం రకాలతో సంకరం చేసి బీపీటీ-2841 వంగడాన్ని తయారుచేశాం. రబీ, ఖరీఫ్ రెండు సీజన్లలో అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడులు వస్తాయి. ఆర్గానిక్ సాగు కింద పండించుకోవడానికి అనుకూలం. ధాన్యాన్ని 2శాతం పాలిష్ చేసుకుంటే సాధారణ బియ్యం ఉడికించినంత సమయంలో అన్నం సిద్ధమవుతుంది. సాగులో ఆశించిన ఫలితాలు రావడంతోపాటు దేశవాళీ నల్ల వంగడాలతో పోలిస్తే అధిక దిగుబడులు వస్తున్నాయి. రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ అనుమతి వచ్చిన వెంటనే బ్రీడర్ విత్తనాలు ఇస్తే అందరికీ అందుబాటులోకి వస్తాయి. - సీవీ రామారావు, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, బాపట్ల
ఇదీ చదవండి: