రాష్ట్రంలో ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికలు జరగనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత కోసం చర్యలు తీసుకున్నారు.
విశాఖలో...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ వినయ్ చంద్ నేతృత్వంలో వీఎంఆర్డీఏ థియేటర్లో పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కౌంటింగ్ సిబ్బందికి 9న శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల విధుల్లో సిబ్బంది తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన పద్ధతులను అధికారులు వివరించారు. ఈనెల 8న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని.. 10న ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. 37 జడ్పీటీసీ, 614 ఎంపీటీసీ స్థానాలకు విశాఖ జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి.
శ్రీకాకుళంలో...
జిల్లాలో పరిషత్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. జడ్పీ ఎన్నికల మాస్టర్ ట్రైనీల శిక్షణా కార్యక్రమంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 590 ఎంపీటీసీ, 37 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. పోలింగ్ అధికారులకు సోమవారం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శాసనసభ నియోజక వర్గ స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ జరపనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
తూర్పుగోదావరిలో...
అమలాపురం డివిజన్ లోని వివిధ మండల కేంద్రాల్లో.. పరిషత్ ఎన్నికలపై పోలింగ్ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. 16 మండలాలకు సంబంధించి 320 ఎంపీటీసీ, 16 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 15 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఒకరు మరణించారు. మిగిలిన 304 చోట్ల ఎన్నికలు జరుగుతాయి. 16 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 72 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ప్రకాశంలో...
యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని మార్కాపురం ఆర్డీవో ఎం.శేషి రెడ్డి ఆదేశించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన.. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ను ఆయన పరిశీలించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది భాద్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతపురంలో...
ఈనెల 8న జరగనున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్ పేపరును.. జిల్లా జడ్పీ కార్యాలయం స్ట్రాంగ్ రూం నుంచి మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ గంధం చంద్రుడు ఈ ప్రక్రియను పరిశీలించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 841 ఎంపీటీసీ, 63 జడ్పీటీసీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అందుకు అనుగుణంగా అధికారులు బ్యాలెట్ పత్రాలు, పెట్టెలను పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారులకు ఒక్కరోజు శిక్షణలో భాగంగా.. జడ్పీ సమావేశ భవనంలో పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పించారు.
ఇదీ చదదవండి: