మండల పరిషత్ ప్రాదేశిక (ఎంపీటీసీ), జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జడ్పీటీసీ) స్థానాలకు మొదట ఎన్నికలు నిర్వహించే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఎన్నికల నిర్వహణకు సమయం తక్కువగా ఉన్నందున ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రాధాన్యమిచ్చి హైకోర్టు ఇచ్చిన గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. గ్రామీణ స్థానిక సంస్థల్లోని అన్ని స్థానాలకూ రిజర్వేషన్లు ఖరారు చేసి 7న రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందివ్వాలన్న హైకోర్టు ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రెండు రోజులుగా ఇదే పనిలో ఉన్నారు. దాదాపు అన్ని జిల్లాలనుంచి వార్డు సభ్యుల స్థానాలకు.. మండలాభివృద్ధి అధికారులు ఖరారు చేసిన రిజర్వేషన్ల వివరాలను సేకరించారు. మొత్తం వివరాలతో 7న ఎన్నికల సంఘానికి నివేదిక అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా సాంకేతిక, న్యాయపరంగా తలెత్తే సందేహాలు, సమస్యలపైనా ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలపై ఎన్నికల షెడ్యూల్ వివరాలతో అఫిడవిట్ దాఖలుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అన్ని స్థానాలకూ ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న భావనతో మూడు దశల్లో చేపట్టేందుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలా అంటే....?
- మొదటి దశలో పార్టీపరంగా, ప్రత్యక్ష పద్ధతిలో 10,149 ఎంపీటీసీ, 660 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
- రెండో దశలో 660 మండలాధ్యక్ష స్థానాలకు, మరో 13 ఛైర్‌పర్సన్ పదవులకు పార్టీపరంగా, పరోక్షపద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. మొదటి దశ ఎన్నికల్లో విజేతలైన ఎంపీటీసీలంతా మండలాలవారీగా వారిలో ఒకరిని ఎంపీపీగా, జడ్పీటీసీ సభ్యులంతా జిల్లాలవారీగా వారిలో ఒకరిని జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు.
- మూడో దశలో 13,057 సర్పంచి, 1,31,927 వార్డు సభ్యుల స్థానాలకు పార్టీలకతీతంగా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
సంక్రాంతి తరువాత ప్రకటన..?
హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాక సంక్రాంతి తరువాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీపై రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 45 నుంచి 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఇప్పటికే హైకోర్టులో ఎన్నికల సంఘం ప్రమాణపత్రాన్ని దాఖలు చేసింది. మార్చిలోగా మూడు దశల ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: