పత్రికా స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్ సర్కారు జారీ చేసిన జీవో 2430.. ఆ ప్రభుత్వ తిరోగమన విధానాలకు అద్దం పడుతోందని పలు పాత్రికేయ సంఘాలు ధ్వజమెత్తాయి. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి ఈ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా మాజీ సెక్రటరీ జనరల్, ప్రెస్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ అనిల్ ఆనంద్ పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రజాస్వామిక జీవోను ఉపసంహరించాలి. ఇందుకోసం పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు చేస్తున్న డిమాండ్‌కు నేను సంపూర్ణ మద్దతు పలుకుతున్నా. దీనిని ఖండించడానికి మాటలు చాలడం లేదు. కేవలం మీడియా గొంతు నొక్కడానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన చర్య ఇది. ఇలాంటి పోకడల ద్వారా సర్కారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాకు కీలకపాత్ర ఉందన్న విషయాన్ని అదే ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా భారీ మెజారిటీతో గెలిచిన జగన్ దృష్టిలో ఉంచుకోవాలి. ఆయనకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ప్రజాస్వామ్యంలో పారదర్శకతను కోరుకునే హక్కు ఉంటుందనీ గుర్తుంచుకోవాలి. ఈ వ్యవస్థలో ప్రజలు, దేశ ప్రయోజనాల కోసం మీడియా ఎప్పుడూ కృషి చేస్తుంది. ఆ పాత్రను అందరూ గౌరవించాలి. కానీ అప్రజాస్వామిక, క్రూరమైన జీవోలు జారీ చేయడం ద్వారా మీడియానే కాకుండా, తనకు ఓటేసి గెలిపించిన ఓటర్లనూ జగన్ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు’అని అనిల్ ఆనంద్ పేర్కొన్నారు.
ఉపసంహరించాలి: పాత్రికేయ సంఘాలు
పత్రికలు, పాత్రికేయుల గొంతు నొక్కేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 జీవోను ఉపసంహరించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, దాసరి కృష్ణారెడ్డి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఉపాధ్యక్షుడు కె.రామనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రాజేష్ డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ధ్వజమెత్తారు. దిల్లీలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వారు ఏపీ ప్రభుత్వ జీవోపై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి జీవోలకు తావులేదని, పత్రికల గొంతు నొక్కే ఇలాంటి ప్రయత్నాలను ఏ ప్రభుత్వం చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ చీకటి జీవోను రద్దు చేయాలన్నారు. దీనిలో తమ యూనియన్ తరఫున రెండో మాటకు తావు లేదని స్పష్టం చేశారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వాలు ఇలాంటి జీవోలను తెచ్చినా వాటిని వెనక్కి తీసుకున్న సందర్భాలున్నాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల వైఖరిని చూసైనా జగన్మోహన్రెడ్డి సర్కారు ఈ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:కలానికి కళ్లెం వేసే జీవోపై ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు