కొవిడ్ కారణంగా విద్యార్థులు ఎన్నో నెలలుగా ఆన్‌లైన్ పాఠాలకే పరిమితమయ్యారు. ప్రత్యక్ష తరగతులకు, ప్రయోగశాలలకూ దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (National Institute of Technology)లో విద్యార్థులకు త్వరలో త్రీడీ గ్రాఫిక్స్ (3D graphics) రూపంలో పాఠాలు బోధించనున్నారు. వర్చువల్ విధానంలో ప్రయోగాలు చేసేందుకు, పాఠాలను దృశ్యరూపంలో త్రీడీ గ్రాఫిక్స్ (3D graphics)తో ఆకట్టుకునేలా చూపేందుకు 'ఇమ్మెన్సివ్ ఈ లెర్నింగ్ ఎడ్యుకేషన్ మెటీరియల్ (Immuneive Learning Education Material)' విధానంలో పాఠాలను రూపొందిస్తున్నారు. ఒకవైపు అధ్యాపకులు పాఠాలు బోధిస్తుంటే.. పక్కనే తెరపై దానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తుంటాయి. రసాయనశాస్త్ర ప్రయోగాలనూ తాకే తెరపై వర్చువల్‌గా చేయొచ్చు.
తెరపై ప్రయోగశాల, పరికరాలు ఉంటాయి. ఒక రసాయనాన్ని బీకర్‌లో పోయాలని పాఠంలో సూచిస్తే.. విద్యార్థులు కంప్యూటర్‌లోనో, మొబైల్ ఫోన్‌లోనో అలాగే చేయొచ్చు. తొలుత మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో గతిశాస్త్రం (కైనెమెటిక్స్) సంబంధించిన పాఠాన్ని ఆచార్యుడు ఆర్.వి.చలం బోధిస్తుండగా.. అందుకు సంబంధించిన దృశ్యాలను కొత్త సాంకేతికతను వినియోగించి రూపొందించారు. ఈ పాఠాలపై ఎన్‌ఐటీ సంచాలకుడు ఆచార్య ఎన్.వి.రమణారావు సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఏ థీరమ్’ అనే గ్రాఫిక్స్ యానిమేషన్ సంస్థ త్రీడీ సాంకేతికత, వీఎఫ్‌ఎక్స్, సిమ్యులేషన్స్ పరిజ్ఞానంతో విద్యార్థులకు కళ్లకు కట్టేలా దృశ్యరూపంలో పాఠాలను రూపొందిస్తోంది.
ఇదీ చదవండి: Train ticket price hike: రైలు ప్రయాణికులపై పెరగనున్న ఛార్జీల భారం