రాష్ట్రంలో కొవిడ్ చికిత్స కోసం వచ్చే ఆరు నెలల్లో అదనంగా రూ.1,000 కోట్లతో మందులు కొనుగోలు చేయటంతో పాటు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వచ్చే 6 నెలల కాలానికి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం... కొవిడ్ పరీక్షలు, క్వారంటైన్ సదుపాయాల కోసం రోజుకు రూ.6.5 కోట్ల ఖర్చు చేస్తున్నామన్నారు. మరింత అదనంగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
మొత్తం 138 ఆస్పత్రుల్లో చికిత్స
కరోనా చికిత్సల కోసం రాష్ట్రంలో అదనంగా మరో 54 ఆస్పత్రులు నెట్వర్క్ పరిధిలోకి తేవాలని సూచించారు. మొత్తంగా 138 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందించాలన్నారు. క్రిటికల్ కేర్ కోసం రాష్ట్రస్థాయిలో అదనంగా 5 ఆస్పత్రులను అనుసంధానించటంతో పాటు... 2,380 పడకలను అందుబాటులోకి తేవాలన్నారు. మొత్తంగా 39,051 పడకలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఖర్చుకు వెనకాడొద్దు
కరోనా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారి విషయంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అత్యంత ఖరీదైన రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్ మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఒక్కో రోగికి ఒక్కో డోసుకు దాదాపు రూ.35 వేల వరకూ ఖర్చైనా వెనుకాడవద్దని సీఎం సూచించారు. విషమ పరిస్ధితుల్లో ఉన్న వారందరికీ ఈ మందులు అందుబాటులో ఉంచాలన్నారు.
రాష్ట్రంలో రికార్డుస్థాయిలో రోజుకు 58 వేల పరీక్షలు చేస్తున్నామన్న అధికారులు... అందుకే పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిందని ముఖ్యమంత్రికి వివరించారు. రానున్న కొన్నిరోజులు కేసుల తీవ్రత ఇలాగే కొనసాగి.. తర్వాత తగ్గుముఖం పడుతుందని చెప్పారు. అంకెలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి..