కరోనాపై తేలికపాటి వ్యాఖ్యలతో వైకాపా నేతలు మొండిగా వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశాన్ని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులున్నా ఈనెల 28 నుంచి సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు చూస్తున్నారని ఆక్షేపించారు. కోర్టులో ఒకటి చెబుతూ బయటకు ఇంకోటి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయవద్దని కోర్టు స్పష్టం చేసినా మళ్లీ అవే వేస్తున్నారని మండిపడ్డారు.
సాక్ష్యాధారాలున్నాయి..
ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి 6 దశాబ్దాల క్రితం నుంచి ఏఏ ప్రభుత్వాలు ఈ కంపెనీకి భూములు , అనుమతులు ఇచ్చారో తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాకే పాలి స్టైరీన్‌కు, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్ విస్తరణకు అనుమతి ఇవ్వడం, కేంద్రానికి సిఫారసు చేసిందనేది నిరూపించేందుకు తమవద్ద అన్ని రుజువులు ఉన్నాయని అన్నారు. విశాఖ దుర్ఘటన మానవ తప్పిదమేన్న చంద్రబాబు... ఎల్జీ పాలిమర్స్‌ను తక్షణమే అక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఆ భూముల్లో పార్క్ అభివృద్ది చేయాలన్నారు.
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పై ఉందని అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను తిరిగి తీసుకురాలేక పోయినా బాధితుల్లో భరోసా నింపాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి భవిష్యత్తు, ఆరోగ్యం కోసం చేయగలిగిన సాయం చేద్దామని కోరారు.
ఇదీ చదవండి :
'కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది'.. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రాతో ముఖాముఖి