కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నేడు భాజపా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగింది. రాష్ట్రంలో కరోనా రోగులను రక్షించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని.. కరోనా కట్టడిపై చెప్పే మాటలు కోటలు దాటుతున్నా, చర్యలు మాత్రం గడప దాటడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కరోనా పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీలో అనేకమంది అధికార పార్టీ ముఖ్య నేతల హస్తం ఉందని ఆరోపించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు లేక, ప్రైవేటు ఆసుపత్రుల్లో పేద రోగులను చేర్చుకోక అల్లాడుతుంటే... సీఎం జగన్ ఒక్క ఆసుపత్రిని కూడా సందర్శించలేదని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే ఆక్సిజన్, రెమిడిసివిర్ మందులు బ్లాక్‌లో అమ్ముకొని దోచుకునేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రూ.2.30 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్యానికి ఎన్ని నిధులు కేటాయించారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో మెడికల్ కళాశాలలకు ఎందుకు నిధులు కేటాయించలేదని నిలదీశారు.
కొవిడ్‌ను అరికట్టేందుకు వెంటనే రూ.3 వేల కోట్లు కేటాయించి, జిల్లాలకు విడుదల చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. మొదటి దశలో వచ్చిన తీవ్ర పరిణామాల తర్వాత రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రైవేటు ఆస్పత్రులు తాము అడ్మిట్ చేసుకున్న రోగుల నుంచి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నాయని.. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా రోగులను తీసుకెళ్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటే జగన్ ఎందుకు ప్రశ్నించలేదని భాజపా నేతలు నిలదీశారు. జగన్ కేసీఆర్‌కు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తప్పుడు ప్రాధాన్యాలతో ప్రభుత్వం ముందుకు పోతోందని ధ్వజమెత్తారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాల్సిన సమయంలో పూజారులు, పాస్టర్‌లు, ఇమామ్‌ల జీతాలను పెంచి ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడాన్ని తప్పుబట్టారు.
ప్రధానమంత్రి కేర్ నిధుల నుంచి రాష్ట్రానికి వేలాది వెంటిలేటర్లను కేంద్ర ప్రభుత్వం పంపిస్తే... అనేక జిల్లాల్లో వాటిని కనీసం వినియోగించకుండా నిరుపయోగంగా ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వెంటిలేటర్లు లేక ప్రజలు చనిపోతున్నారని.. దీనికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... 'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'