తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం) పంపిణీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని అనకాపల్లి రెస్కోను రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆదేశించింది. రెస్కో లైసెన్సు పునరుద్ధరించే విషయమై కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఈ కారణంగా రెస్కో పరిధిలో విద్యుత్తు బిల్లుల వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదే తీరులో చీపురుపల్లి రెస్కో పరిధిలోని కార్యకలాపాలనూ పూర్తిగా డిస్కం సిబ్బందే పర్యవేక్షించాలని ఆదేశించింది. ఎలాంటి లైసెన్సు లేకుండానే రెస్కోలు విద్యుత్తు బిల్లులు వసూళ్లు చేసుకుంటున్నా చర్యలు తీసుకోని ఈపీడీసీఎల్ అధికారులపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వచ్చే నెల 10న ఈపీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్ (ఆర్థిక) స్వయంగా విచారణకు హాజరై, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. అనకాపల్లి రెస్కో నుంచి ఇంకా జమ కావాల్సిన రూ.5,16,90,332కు సంబంధించిన లెక్కలను పరిశీలించి వాస్తవాలను కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి డిస్కంను ఆదేశించారు.
ఈ నెల 13న చేపట్టిన కేసు విచారణకు రెస్కో ఎండీ హాజరు కాకపోవడంతో కమిషన్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బుధవారం జరిగిన విచారణకు రెస్కో ఎండీ కృష్ణంరాజు నేరుగా హాజరయ్యారు. విద్యుత్ బిల్లుల రూపేణా రెస్కో వసూలు చేసిన మొత్తంలో రూ.12,37,95,260 ఇప్పటికే ఈపీడీసీఎల్ ఖాతాలో జమ చేశామని, మరో రూ.5,16,90,332 సిబ్బంది జీతాలు, రుణాల చెల్లింపు కోసం వినియోగించినట్లు కమిషన్ ముందు అంగీకరించారు. దీన్ని పరిశీలించిన కమిషన్.. అనకాపల్లి రెస్కో నుంచి ఇంకా వసూలు కావాల్సిన రూ.5.16 కోట్లకు సంబంధించిన లెక్కలను వచ్చే నెల విచారణకు హాజరయ్యే నాటికి అందించాలని ఆదేశించింది. అలాగే రెస్కో ఎండీగా కృష్ణంరాజు తీసుకున్న జూన్ నెల జీతం మొత్తాన్ని శుక్రవారం ఉదయంలోగా రికవరీ చేయాలని కమిషన్ ఛైర్మన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: