ఎన్సీఎల్టీని అమరావతికి మార్చండి: గల్లా జయదేవ్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్ అమరావతి పేరు మీద ఉన్నా హైదరాబాద్‌లో కొనసాగిస్తున్నారని.. దానిని వెంటనే అమరావతికి మార్చాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ కోరారు. ద ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ (సవరణ) బిల్లు-2020పై లోక్‌సభలో సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. హిందూ దేవాలయాలపై, హిందూ విశ్వాసాలపై దాడులు సహించకూడదని జయదేవ్ అన్నారు. లోక్‌సభ శూన్య గంటలో ఆయన మాట్లాడారు.
రైల్వేజోన్‌ను ప్రారంభించాలి: రామ్మోహన్
ఉత్తరాంధ్ర ప్రజల కల, డిమాండ్ అయిన దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని తెదేపా లోక్‌సభా పక్ష నేత రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ..విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి 18 నెలలు పూర్తయినా నేటి వరకు పూర్తి స్థాయిలో కార్యక్రమాలు ప్రారంభం కాలేదన్నారు. జోన్ హద్దులపై స్పష్టత లేదన్నారు.
న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి: బాలశౌరి
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్‌ల సంఖ్యను పెంచాలని వైకాపా ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు. పలు బోగస్ కంపెనీలు న్యాయస్థానాలకు వెళ్లి న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయని అన్నారు. ద ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ (సవరణ) బిల్లుకు వైకాపా పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు.
ఇదీ చదవండి: ఇవాళ దిల్లీకి సీఎం జగన్..ప్రధానితో భేటీ!