జమ్ము-కశ్మీర్‌లో ముష్కరుల దాడిలో అమరుడైన వీర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లె గ్రామం. వీర జవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రాణత్యాగం వెలకట్టలేనిదని సీఎం జగన్ అన్నారు. అతని త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. జవాను మరణం ఆ కుటుంబానికి తీరని లోటన్న ఆయన...కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు లేఖ రాసిన సీఎం... ఆ సహాయం స్వీకరించాలని లేఖలో కోరారు.
అమరుడైన వీర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు జంగాలపల్లి శ్రీనివాస్, ఎం. ఎస్. బాబు, ఎస్పీ సెంథిల్ కుమార్ అధికారులు పరామర్శించారు. సీఎం రాసిన లేఖను అందజేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన మాచిల్ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో వీర మరణం పొందారు.
ముష్కరుల దాడిలో అమరుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. జవాను భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ భూమి, గృహవసతి కల్పించడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు.
సంబంధిత కథనాలు